తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు బ్రేకులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతలు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇవాళ కోర్టు దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. యాత్రకు అనుమతి రాకున్నా... ముందస్తుగా అనుకున్న ప్లాన్ ప్రకారం యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ మాత్రం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 


ఈనెల 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరుతామంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించబోతున్న మీటింగ్‌కు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇస్తే యాత్ర రూటును మారుస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. రూటు దూరాన్ని తగ్గించి స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్‌కి వెళ్ళాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ బహిరంగ సభకు ఎక్కవు మంది వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాన్నింటిపై చర్చించేందుకు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో బండి సంజయ్ సమావేశంకానున్నారు. కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. 


అసలేం జరిగిందంటే?


ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ నేతలు చేసిన నిరసనలో పలువురు బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందని... అందుకు నిరసనగా బండి సంజయ్ దీక్ష చేయబోయారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని దీక్షకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. ధర్మ దీక్షకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకన్నారు. చాలా సమయం జనగామలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను కరీంనగర్ తీసుకొని ఆయన ఇంట్లోనే నిర్బంధించారు.


యాత్ర మధ్యలోనే బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకొని కరీంనగర్‌కు తరలిచండంపై బీజేపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే హైకోర్టులో యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని బండి సంజయ్ పిటిషన్ వేశారు.  


లిక్కర్ స్కాంను పక్కదోవ పట్టించేందుకే..!


బండి సంజయ్ గృహ నిర్బంధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. యాత్రను అడ్డుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ జరుపుతానన స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని వివరించారు. 


పాదయాత్రకు అనుమతివ్వాలంటూ వినతి పత్రం..


ఢిల్లీ లిక్కర్ స్పాం ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే బండి సంజయ్ యాత్రను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కావాలనే టీఆర్ఎస్ నాయకలు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాసంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని.. పాదయాత్ర వ్యవహారాలను చూస్తున్న జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రకటించారు. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని స్ఫష్టం చేశారు.