నో బంగారం.. ఓన్లీ క్యాష్.. .ఎక్కడ దొంగతనానికి వెళ్లినా కేవలం నగదును మాత్రమే దొంగతనం చేసే దొంగను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ దొంగతనానికి వెళ్లినా క్యాష్ కన్నా ఎక్కవు బంగారం కనిపించినా ఆ దొంగ, బంగారం మాత్రం టచ్ చేయడు. తెలంగాణా రాష్ట్రంలో పదికిపైగా కేసులు కూడా ఆ దొంగ మీద ఉన్నాయి. అయితే ఇప్పుడు బెజవాడ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది. వస్త్ర దుకాణాలు, ఇళ్లలో నగదు మాత్రమే దొంగిలించే నిందితుడు ఐ.సురేష్ అలియాస్ సోనిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించటంతో అనేక ఆశ్చర్యకరమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జులై 24వ తేది బెజవాడ బీసెంట్ రోడ్డులోని వర్ష క్లాత్ స్టోర్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది. అయితే ఉదయమే షాప్ ఓపెన్ చేసేందుకు వచ్చిన యజమానికి దొంగతనం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఆ యజమాని పోలీసులకు విషయం తెలిపాడు. సుమారు లక్ష 96 వేల నగదు దొంగతనం జరిగినట్టు వివరించాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడు సురేష్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 90 వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన నిందితుడు సురేష్, వస్త్ర దుకాణాల్లో, ఇళ్లలో.. నగదు మాత్రమే దొంగతనం చేస్తాడని, అతనిపై తెలంగాణలో 10 కేసులు ఉన్నాయని ఆంధ్రాలో ఇదే మొదటి కేసని పోలీసులు తెలిపారు.
తెలంగాణా నుంచి ఏపీకి మకాం....
నిందితుడు సోని తెలంగాణాలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అయితే అక్కడ పోలీసులకు సోని నోటెడ్ అయిపోయాడు. చోరీ ఘటనలో కేవలం నగదు మాత్రమే మాయం అయ్యి, బంగారం ఆభరణాలు అక్కడే ఉన్నాయంటే అందులో కచ్చితంగా సోని హస్తం ఉంటుందనే నమ్మకంతో పోలీసులు సోని కోసం వెతికి అతన్ని అరెస్ట్ చేయటం పరిపాటిగా మారింది. దీంతో సోని తెలంగాణా రాష్ట్రం నుంచి ఏపీకి మకాం మార్చాడు. అయితే సోని చేసిన తొలి దొంగతనంలోనే పోలీసులకు చిక్కాడు. దీంతో తెలంగాణాలో దొంగతనాలకు సంబందిచిన జాబితా కూడా వెలుగు చూసింది.
కేవలం కరెన్సీనే ఎందుకంటే....
సోని కేవలం నగదును మాత్రమే దొంగతనం చేస్తాడు. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కేవలం క్యాష్ అయితే ఖర్చు పెట్టేందుకు చాలా ఈజీగా ఉంటుంది. అదే బంగారం ఇతర విలువయిన వస్తువులు అయితే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవటం కాలా కష్టంగా ఉంటుంది. పోలీసులకు కూడా చిక్కి అరెస్ట్ అవుతున్న సందర్బాలు చాలా ఉన్నాయి. దీంతో క్యాష్ అయితే దొంగతనం చేసిన తరువాత వాటిని ఖర్చు చేసుకునేందుకు వీలుటుందనే ఉద్దేశంతోనే సోని క్యాష్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. అదనమాట ఆయన ఓన్లీ క్యాష్ చోరీ వెనుక ఉన్న అసలు సంగతి.