అందరికీ అందుబాటులో ఉండేవి, అన్ని సీజన్లలో దొరికే పండ్లు అరటి పండ్లే. పిల్లలకు, పెద్దలకు బాగా నచ్చేవి కూడా ఇవే. రోజుకో మీడియం సైజు అరటి పండు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు రాకమానవు. కొంతమంది పండ్లు ఎదురుగా కనిపిస్తే చాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... ఇలా మూడు పూటలా సమయం చూసుకోకుండా తినేస్తుంటారు. ఇలా ఒక్క నాలుగు రోజులు తింటే చాలు ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తుతుంది. అరటి పండ్లు అధికంగా తినేవారిలో మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే మైగ్రేన్ వంటి తలనొప్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మైగ్రేన్ ఉన్న వారు అరటిపండ్లను రోజుకు ఒకటికి మించి తినకపోవడమే మంచిది. అలాగే మధుమేహం ఉన్న వారు కూడా అరటిం పండ్లకు దూరంగా ఉండాలి. రెండు రోజులకో అరటిపండు తింటే ఫర్వలేదు కానీ, రోజూ తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ పండులో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇదే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తుంది. అలాగే అరటి పండ్లు అధికంగా తినడం వల్ల బాగా బరువు పెరుగుతారు. అది కూడా త్వరగా. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల పొటాషియం శరీరంలో అవసరానికి మించి పేరుకుపోతుంది. దీని వల్ల హైపర్కెల్మియా వచ్చే అవకాశం ఉంది. ఇదొక అనారోగ్య సమస్య.
అరటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అరటి పండ్లు అధికంగా తిన్నాక పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. అలాగే దంతక్షయం కూడా కలుగుతుంది. అది కాకుండా అధికంగా ఈ పండ్లను తినడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, ఉదయం పూట కూడా నిద్ర మత్తులో ఉంటారు.
ఎన్ని తినాలి?
ఏ ఆరోగ్య సమస్య లేని వారు రోజుకు రెండు పండ్లు తింటే చాలు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి తింటే మేలు జరుగుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినకపోవడమే మంచిది. అలాగే అరటి పండు తిన్నాక గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. జలుబు వంటివి రావు. పిల్లలకైతే కచ్చితంగా ఇలాగే తినిపించాలి.
తింటే మంచిదే
అరటి పండు రోజుకు ఒకటి తినడం వల్ల చాల మేలు జరుగుతుంది. పెద్ద అరటిపండు కాకుండా మీడియం సైజుది తింటే చాలు. దీనిలో ఉండే పొటాషియం గుండెపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియంలో 9 శాతం అరటిపండు తీర్చేస్తుంది. ఈ పండులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. లెక్టిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఫ్రీరాడికల్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి కణాలను చంపేసి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. అతిసారంతో బాధపడేవారు అరటిపండు తింటే మంచిది. ఎందుకంటే దీనిలో నీరు, పొటాషియం ఉంటుంది కాబట్టి వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా మేలు చేస్తుంది.
Also read: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు
Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.