Ysrcp Inside Politics : రాజకీయాల్లో గెలుపు గుర్రాలదే హవా. గెలిచే వాళ్లకే టిక్కెట్లని అన్ని పార్టీలూ చెబుతూంటాయి. అందులో ఏపీ అధికార పార్టీ కూడా మినహాయింపు కాదు. పైగా ఇప్పుడు ఆ పార్టీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే... అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఉన్నారు. మారుతున్న రాజకీయంతో పని చేసేవాళ్లు.. చేయని వాళ్లు.. రాజకీయ సమీకరణాలు చెడగొట్టుకున్న వాళ్లు.. ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్న వాళ్లు ఇలా.. అనేక రకాలుగా లెక్కలేసి.. సర్వేలు చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కొన్ని లెక్కలు రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం కనీసం అరవై మంది ఎమ్మెల్యేల టిక్కెట్లు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో పన్నెండుమంది ఎంపీలు ఉన్నా... వారిలో అత్యధిక మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించేసిన వైఎస్ఆర్‌సీపీ అధినేత !
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా.. అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను జగన్ నియమించారు. ఎమ్మెల్యే ఉండగా ఇలా మరొకర్ని నియమించడం అసాధారణం. అందుకే అక్కడి ఎమ్మెల్యే రగిలిపోయారు. కానీ జగన్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. అక్కడి ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం.. సరిగ్గా పని చేయకపోవడం..వంటి కారణాలతో మార్చాలనుకుని డిసైడయ్యే.. ఈ నియామకం చేశారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మరో మాటకు చాన్స్ లేదని.. నిరసనలు వ్యక్తం చేసినా కఠినంగానే వ్యవహరిస్తామన్న సంకేతాలు ఇప్పటికే పంపారు. దాంతో ఎమ్మెల్యే కూడా సైలెంట్ అయ్యారు. ఆమె అనుచరులూ ఇప్పుడు నోరు తెరవడం లేదు.
ఇక వరుసగా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు !
సర్వేల్లో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తల్ని నియమించబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండనున్నాయి. మరో ముఫ్ఫై మంది ఎమ్మెల్యేల పరిస్ధితి అటూ ఇటూగా ఉన్నప్పటికీ.. వారికి ఇప్పటికిప్పుడే ప్రత్యామ్నాయం చూస్తే.. తేడా వస్తుందన్న ఉద్దేశంతో సైలెంట్‌గా ద్వితీయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి కొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్చార్జులను నియమించడం, మార్పులు చేయడంపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరి సీటుకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల్లో నెలకొంది.
రెండు, మూడు రకాల సర్వేలు చేయిస్తున్న సీఎం జగన్ !
సీఎం వైఎస్ జగన్ మొత్తం 175 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించారు. ఐ ప్యాక్ టీంతోపాటు ఢిల్లీకి చెందిన మరో సంస్థతోనూ ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. ధర్డ్ పార్టీ టీములతోనూ సర్వేలు చేయించారు. వాళ్లు ఇచ్చిన నివేదికలను బట్టి మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే 12 మంది ఎంపీలను కూడా మార్చే అవకాశముంది. కొందర్ని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపడం.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అదనపు ఇన్చార్జులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది.
మంత్రులకూ మినహాయింపు లేదు.. టిక్కెట్లు కూడా డౌటే !
వైఎస్ఆర్‌సీపీలో ఏదైనా జగన్ నిర్ణయమే ఫైనల్. సర్వేల ప్రకారం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో మంత్రులకు కష్టకాలమేనన్న ప్రచారంజరుగుతోంది. కనీసం అరడజన్ మంది మంత్రులకు టిక్కెట్లు ఉండకపోవచ్చని.. గట్టిగా పట్టుబడితే వారిలో కొంత మందిని ఎంపీలుగా పంపించే చాన్స్ ఉందని భావిస్తున్నారు. 12 ఎంపీ నియోజవర్గాల్లోని పార్టీ ఎంపీలు, ఇన్చార్జులను కూడా మార్చనున్నట్లు వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హిందూపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయంటున్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎసెస్‌మెంట్ !
ఇప్పటిదాకా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తలమునకలవుతున్నారు ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు. వారిపై వస్తున్న వ్యతిరేకతను బట్టి.. మార్పులు చేస్తే ప్రజల్లో సానుకూలత వస్తందని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మార్పులతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అసలు ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉంటే ఈ మార్పులు మరింత నష్టానికి దారి తీసే అవకాశముందన్న విశ్లేషణ వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.