Tips to Maintain Bone Density as You Age : వయసు పెరిగే కొద్దీ చర్మం, జుట్టులో మార్పులు వచ్చినట్టే.. ఎముకల్లోనూ క్రమంగా మార్పులు జరుగుతాయి. 30 ఏళ్ల తర్వాత క్రమంగా బోన్ మాస్ తగ్గే ప్రక్రియ మొదలవుతుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈ తగ్గుదల వేగంగా ఉండొచ్చు. బోన్ డెన్సిటీ (Bone Density) తగ్గితే ఎముకలు బలహీనంగా మారి చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అయితే సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలితో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి బోన్స్​ను హెల్తీగా ఉంచే అలవాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

బోన్ డెన్సిటీ 

ఎముకల్లో ఉండే ఖనిజాలు, ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ పరిమాణాన్ని బోన్ డెన్సిటీ అంటారు. డెన్సిటీ ఎక్కువగా ఉంటే సాధారణంగా ఎముకలు బలంగా ఉంటాయి. ఇది తగ్గినప్పుడు ఎముకలు పెళుసుగా మారి ఫ్రాక్చర్ రిస్క్ పెరగవచ్చు. బోన్ డెన్సిటీని తెలుసుకునేందుకు DXA స్కాన్ వంటి టెస్ట్​లు చేస్తారు.

Also Read : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

Continues below advertisement

వయసు పెరిగే కొద్దీ..

వయసు పెరిగే కొద్దీ కొత్త ఎముక ఏర్పడే వేగం తగ్గి.. ఎముకల నష్టం పెరగవచ్చు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అయితే వయసు ఒక్కటే కాదు.. కుటుంబ చరిత్ర, ఆహారం, వ్యాయామం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి.

బోన్ డెన్సిటీ తగ్గితే కనిపించే సంకేతాలు

ఆస్టియోపోరోసిస్‌ను చాలాసార్లు సైలెంట్ డిసీజ్ అంటారు. ఎందుకంటే ఎముకలు బలహీనపడుతున్న సమయంలో ప్రత్యేకమైన లక్షణాలు లేకపోవచ్చు. ఫ్రాక్చర్ అయిన తర్వాతే సమస్య బయటపడే సందర్భాలు ఉన్నాయి. వెన్నునొప్పి, ఎత్తు తగ్గడం, వెన్ను వంగినట్టుగా కనిపించడం వంటి లక్షణాలు వెన్నెముక ఎముకల్లో ఫ్రాక్చర్లకు సంకేతాలు కావచ్చు.

Also Read : 30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే

ఆస్టియోపీనియా vs ఆస్టియోపోరోసిస్ 

బోన్ డెన్సిటీ పరీక్షలో వచ్చిన ఫలితాలను బట్టి ఎముకల పరిస్థితిని అంచనా వేస్తారు. T-score -1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సాధారణ పరిధిగా.. -1 నుంచి -2.5 మధ్య ఉంటే ఆస్టియోపీనియా (తక్కువ బోన్ డెన్సిటీ)గా.. -2.5 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఆస్టియోపోరోసిస్గా పరిగణిస్తారు. అయితే పరీక్ష ఫలితాలను వయసు, ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలతో కలిపి అంచనా వేస్తారు.

కాల్షియం తీసుకుంటే సరిపోతుందా?

ఎముకల బలానికి కాల్షియం చాలా అవసరం. మన ఆహారంలో కాల్షియం తక్కువగా ఉంటే శరీరం ఎముకల్లో నిల్వ ఉన్న కాల్షియంను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అలాగే విటమిన్ D కాల్షియం శరీరంలో శోషించుకోవడానికి సహాయపడుతుంది. పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, కొన్ని ఆకుకూరలు, కాల్షియం కలిపిన ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

Also Read : 90 శాతం మహిళల్లో విటమిన్ డి లోపం ఉందట.. ఎముకల నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్​కు ఇదే కారణమట

ఎముకల ఆరోగ్యం కోసం..

ఎముకల ఆరోగ్యానికి కేవలం విశ్రాంతి తీసుకుంటే సరిపోదు. వాకింగ్, మెట్లు ఎక్కడం, రెసిస్టెన్స్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం బ్యాలెన్స్‌ను మెరుగుపరచి పడిపోవడం, ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఎముకలకు నష్టం చేసే అలవాట్లు

శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చోవడం, ధూమపానం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లు బోన్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అలాగే కొన్ని మందులను దీర్ఘకాలం ఉపయోగించడం.. కొన్ని థైరాయిడ్ లేదా ఇతర హార్మోన్ల సమస్యలు కూడా ఎముకల నష్టానికి కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సలహా తీసుకోవాలి. 

Also Read : ఎత్తు తగ్గడానికి కారణాలు ఇవే.. ఎవరి Height అకస్మాత్తుగా తగ్గుతుందో తెలుసా?

తక్కువ బరువు ఉంటే జాగ్రత్త

బోన్ హెల్త్ విషయంలో ఎప్పుడూ అధిక బరువు గురించే మాట్లాడుతుంటారు. కానీ చాలా తక్కువ బరువు లేదా అండర్‌వెయిట్‌గా ఉన్నా కూడా ఎముకల నష్టం జరుగుతుంది. పోషకాహారం, ప్రోటీన్ తగినంతగా తీసుకోకపోవడం ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

బోన్ డెన్సిటీ తగ్గితే..

ఇప్పటికే బోన్ డెన్సిటీ తగ్గితే సొంతంగా కాల్షియం లేదా విటమిన్ D సప్లిమెంట్లు తీసుకోకూడదు. ఆహారం, వ్యాయామం, విటమిన్ D స్థాయిలు, ఫ్రాక్చర్ రిస్క్, ఇతర అనారోగ్యాలు వంటి అంశాలను బట్టి వైద్యుడు చికిత్సను నిర్ణయిస్తారు. అవసరమైన సందర్భాల్లో మందులు కూడా సూచిస్తారు.

Also Read : రక్తం ఎక్కడ తయారవుతుందో తెలుసా? ఎముకలు ఈ ప్రక్రియలో ఎలా సహాయపడతాయి?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.