Sudden Height Loss Causes : వయసు పెరిగే కొద్ది ఎత్తు పెరుగుతాము. యవ్వనంలోకి, ఒక వయసు వచ్చేవరకు ఎత్తు ఎదుగుతాము. కానీ మీకు తెలుసా? వయస్సు పెరిగే కొద్దీ.. ఎత్తు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుందట. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువమందికి తెలియదు. ఉదాహరణతో చెప్పాలంటే.. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 80 ఏళ్ల వయసులో దాదాపు అర అంగుళం తక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న మహిళ 90 ఏళ్ల వయసులో 5 అడుగుల 2 అంగుళాలకు తగ్గవచ్చు.
చాలామందిలో ఎత్తు తగ్గడం 40 నుంచి 50 సంవత్సరాల వయస్సులో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ 70 సంవత్సరాల తర్వాత ఇది వేగంగా పెరుగుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. వృద్ధాప్యంలో వెన్నెముకలో మార్పులు, డిస్క్‌లు సన్నబడటం, భంగిమ క్షీణించడం ఎత్తు తగ్గడానికి సాధారణ కారణాలు. అయితే 1 అంగుళం కంటే ఎక్కువ ఎత్తు తగ్గితే.. అది సాధారణ సమస్యగా పరిగణించరు. తీవ్రమైన సమస్యను సూచిస్తుంది.
ఎత్తు తగ్గడం బోలు ఎముకల వ్యాధి లక్షణమా?
ఈ టాపిక్ గురించి ఆటోఇమ్యూన్ డిసీజ్, న్యూరాలజీ నిపుణులు, MD రుమటాలజీ డాక్టర్ రుత్ జేసన్ హిక్‌మన్ చర్చించారు. ఎత్తు తగ్గడం బోలు ఎముకల వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని తెలిపారు. ఈ వ్యాధిలో ఎముకలు బలహీనపడతాయి. సన్నబడతాయి. దీని వలన ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. వెన్నెముక కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం వంగిపోతుంది. ఎత్తు తగ్గినప్పుడు లేదా అకస్మాత్తుగా ఫ్రాక్చర్ అయినప్పుడు బోలు ఎముకల వ్యాధిని గుర్తిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం.. 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు తగ్గిన పురుషులలో.. హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం రెట్టింపు అవుతుందట.
ఎత్తు ఎందుకు తగ్గుతుంది?
verywellhealth ప్రకారం.. బోలు వ్యాధి ఉంటే ఎత్తు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కంప్రెషన్ ఫ్రాక్చర్ మొదటి స్థానంలో ఉంది. దీనిలో బలహీనమైన ఎముకలు తేలికపాటి పగుళ్లు లేదా ఒత్తిడి ఫ్రాక్చర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఫ్రాక్చర్‌లలో తరచుగా తీవ్రమైన నొప్పి ఉండదు. కాబట్టి ప్రజలు వాటిని సాధారణ నడుము నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీనివల్ల వెన్నెముక కుంచించుకుపోతుంది. ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుంది. రెండవ స్థానంలో కైఫోసిస్ ఉంది. ఇందులో ఎగువ వీపు గుండ్రంగా లేదా వంగి కనిపిస్తుంది. బోలు ఎముకల వ్యాధి కారణంగా వెన్నెముక బలహీనపడినప్పుడు.. శరీరం ముందుకు వంగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎత్తు తగ్గినట్లు కనిపిస్తుంది.
ఎత్తు మళ్లీ పెరుగుతుందా?
చాలా సందర్భాల్లో బోలు ఎముకల వ్యాధి కారణంగా తగ్గిన ఎత్తు తిరిగి రాదు. కానీ మీరు భవిష్యత్తులో ఎత్తు తగ్గకుండా ఖచ్చితంగా నిరోధించవచ్చు. దీని కోసం మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.