కాకరకాయలతో చేసిన వంటలు పెద్దగా ఎవరూ ఇష్టపడరు. పిల్లలైతే పూర్తిగా తినరు. కాకరకాయలో ఉండే చేదును వారు ఇష్టపడరు. చేదు లేకుండా కాకరకాయ వేపుడు చేయచ్చు.అదే కాకరకాయ పల్లీకారం. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్. ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాం. 


కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - అరకిలో
వేరుశెనగపలుకులు (పల్లీలు) - అరకప్పు
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - పది
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - పది నుంచి పదిహేను
నూనె - మూడు స్పూనులు
పసుపు - ఒక స్పూను


తయారీ ఇలా...
1. కాకరకాయలను పైన చెక్కు తీసేసి గుండ్రంగా, పలుచగా కోసుకోవాలి. 
2. ఇప్పుడు ఒక స్పూను పసుపు, ఉప్పు వేసి ముక్కల్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 
3.  ఈలోపు పల్లికారం తయారుచేసుకోవాలి. 
4. స్టవ్ పై కళాయి పెట్టి  వేరుశెనగపలుకులు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరీ అధికంగా వేయించకూడదు. ఓ రెండు నిమిషాలు వేయిస్తే చాలు. 
5. ఇప్పుడు అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. 
6. మిక్సీలో పల్లీలు, ధనియాుల, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఉప్పు వేసి పొడి చేసి పెట్టుకోవాలి. పల్లీల కారం రెడీ అయినట్టే.
7. ముందుగా పసుపు, ఉప్పు వేసి నానబెట్టిన కాకరకాయ ముక్కల్లోని నీటిని తీసేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. 
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక కాకరముక్కలు వేసి వేయించాలి. 
9. కాకరకాయ ముక్కలు వేగాక ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కలపాలి. 
10. చిన్న మంట మీద ముక్కలు వేయించాలి. పదినిమిషాలు వేయించాక స్టవ్ కట్టేయాలి. కాకరకాయ పల్లీకారం టేస్టీగా సిద్ధమైపోయింది. దీన్ని పప్పన్నం లేదా, సాంబారన్నంతో నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తిన్నా కూడా రుచి బావుంటుంది. 


కాకరకాయ తింటే ఎన్ని లాభాలో...
మధుమేహంతో బాధపడేవారికి కాకరకాయ ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని రోజూ తిన్నా వారికి  మంచిదే. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ముందుంటుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధిచేయడంలో కూడా సహకరిస్తుంది. కాలిన గాయాలు, పుండ్లు ఏర్పడినప్పుడు కాకరకాయ తింటే త్వరగా మానిపోతుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో మంట వంటివి కలగవు. గుండె సంబంధిత రోగాలను తగ్గించడంలో ఇది ముందుంటుంది. 


Also read: ‘దీపికా పడుకోన్ దోశె’ ధరెంతో తెలుసా? సెలెబ్రిటీల పేరుతో అమ్ముడవుతున్న ఆహారాలు ఇవిగో


Also read: ముద్దుల తమ్ముడికి అయిదు కిలోల లెటర్ రాసిన అక్క, ఇదో వరల్డ్ రికార్డు