తల్లి తరువాత సోదరే తల్లి ఏ అన్నదమ్ముడికైనా. అక్కా తమ్ముళ్ల అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ప్రతి ఏడాది రాఖీ పండుగ, వరల్డ్ బ్రదర్స్ డే వంటి ప్రత్యేక రోజులు వెలిశాయి. అయితే ఓ అక్క తన ప్రేమనంతా అక్షరాల రూపంలో మార్చి తమ్ముడికి లెటర్ రాసింది. ఆ లెటర్ త్వరలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన కేరళలో జరిగింది.
కృష్ణప్రియ, కృష్ణ ప్రసాద్ ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. అక్క కేరళలోని ఇడుక్కిలో ఇంజినీరింగ్ చదువుతుంటే, తమ్ముడు మరోచోట చదువుకుంటున్నాడు. ఈ మధ్యన వరల్డ్ బ్రదర్స్ డే జరిగింది. ఆ రోజు తమ్ముడిని విష్ చేయడం మర్చిపోయింది అక్క. వెంటనే తమ్ముడు అక్కకు మెసేజ్‌లు పంపించాడు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల కృష్ణప్రియ ఆ మెసేజ్‌లు కూడా చూసుకోలేదు. దీంతో తమ్ముడికి చాలా కోపం వచ్చింది. అక్కను ఫోన్లో, వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. కొన్ని గంటల తరువాత మెసేజ్ లు చూసుకున్న కృష్ణప్రియ తమ్ముడికి ఫోన్ చేసేందుకు, మెసేజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఉత్తరం రాసి పంపిద్దామని వెళ్లి ఏ4 సైజు పేపర్లు కొని తెచ్చుకుంది.
ఒక పేపర్ తో మొదలుపెట్టిన రాత సాగుతూ పోయింది. ఒకటి, రెండూ, మూడు....అలా బోలెడు పేపర్లు నింపేసింది. ఆ పేపర్లన్నీ వరుసగా పెట్టి కొలిస్తే దాదాపు 434 మీటర్ల పొడవు వచ్చాయి. అదే బరువు విషయానికి వస్తే అవన్నీ ఆ పేపర్లన్నీ అయిదు కిలోలకు పైగా బరువు తేలాయి. వాటిని తమ్ముడికి పార్శిల్ చేసి పోస్టు చేయడానికి చాలా ఇబ్బంది పడింది కృష్ణప్రియ. 12 గంటల పాటూ కదలకుండా కూర్చుని రాసిందట ఆ ఉత్తరాలు.
గిఫ్ట్ అనుకుని...
ఆ ఉత్తరాల పార్శిల్ ను అందుకున్న తమ్ముడు మొదట దాన్ని గిఫ్ట్ అనుకున్నాడట. బర్త్ డే కు అక్కడ బహుమతి పంపించి ఉంటుందని ఆశించాడట. తీరా ఓపెన్ చేస్తే ఉత్తరాల వెల్లువ బయటపడింది. వాటిని చదవడానికి తమ్ముడికి ఓపిక కూడా సరిపోలేదు. ఆ ఉత్తరాలు చూశాక అక్క మీద కోపం పోయింది. ఒక్క మెసేజ్ పెట్టలేదు అని అలిగాడు, కానీ అక్కడ ఏకంగా ఒక జీవితానికి సరిపడా ఉత్తరాల్లో తన ప్రేమను నింపి పంపింది.
ఇప్పుడు కృష్ణప్రియ గిన్నిస్ బుక్ వారికి తన ఉత్తరాల గురించి వివరాలు పంపింది. వరల్డ్ రికార్డు సాధించేందుకు సిద్ధంగా ఉంది.
Also read: పైనాపిల్ పుట్టిల్లు ఆ దేశమే, పేరు పెట్టింది మాత్రం మరో దేశస్థులు