వరల్డ్ పైనాపిల్ డే... ప్రతి ఏడాది జూన్ 27న నిర్వహించుకుంటారు.పైనాపిల్ డేను 2016 నుంచి ఇలా చేయడం మొదలుపెట్టారు. పైనాపిల్ పుట్టిల్లుగా అమెరికాను చెప్పుకుంటారు. కానా అమెరికాకు చేరింది వెస్టిండీస్ నుంచి అని ఒక కథనం. ప్రపంచ యాత్రికుడు క్రిస్టోఫర్ కొలంబస్, సర్ వాల్టర్ రాలీ తదితరులు దీన్ని వెస్టిండీస్ లో కనుగొన్నట్టు కొన్ని రాతపూర్వక ఆధారాలు దొరికాయని అంటారు. వారే ఆ పండును అమెరికాకు తీసుకొచ్చి ఇక్కడి ఉష్ణమండల ప్రాంతాల్లో పండించినట్టు చెబుతారు. అప్పట్లో స్థానికులు ఈ పండులో వైన్ చేసుకుని తాగేవారట. ఈ పండుకు పైన్ ఆపిల్ అనే  పేరు పెట్టింది మాత్రం యూరోపియన్లని అంటారు. ఇది చూసేందుకు పైన్ కోన్‌లను పోలి ఉంటుందని, అందుకే పైన్ యాపిల్ అనే పేరు పెట్టినట్టు చెబుతారు. వాడుకలో పైనాపిల్‌గా మారిపోయింది.


గిరిజనుల ఆహారం...
వందల ఏళ్ల క్రితం అమెజాన్ అడవుల్లో, బ్రెజిల్ వంటి దేశ అడవుల్లో నివసించి ‘టుపి’ అని పిలిచే గిరిజనులకు ఇది ప్రధాన ఆహారంగా ఉండేదట. ఈ గిరిజనులే ఈ పండును మొదట రుచి చూశారని కూడా చెబుతారు. వీరు గత 2,900 ఏళ్ల నుంచి జీవిస్తున్నారని చరిత్రకారుల అంచనా. ఇంకా వారు బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్నారని అంటారు. 


మనదేశానికి ఎప్పుడు వచ్చిందంటే..
ఎక్కడో ఓ మూల పండిన పండు ప్రపంచమంతా పరిచయం అవ్వడానికి కారణం పోర్చుగీసు వారు. వారు 1502లో దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న సెయింట్ హెలెనా అనే ద్వీపానికి వచ్చారు. అప్పుడు ఆ పండును వెంట తెచ్చారు. అక్కడ కొన్నాళ్లు పాటూ పండించారు. ఆ తరువాత అక్కడ్నించి ఆఫ్రికాకు తీసుకెళ్లి పరిచయం చేశారు. అలా వారే దాదాపు చాలా దేశాలకు తీసుకెళ్లారు. ఇక భారతదేశానికి  1550లో పోర్చుగీసువారే తమతో పాటూ తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజలకు ఆ పండు రుచి చూపించి పండించేలా చూశారు. ఇప్పుడు పైనాపిల్ అధికంగా పండిస్తున్న దేశాలు బ్రెజిల్, కోస్టారికా, చైనా, భారత్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మొదలగునవి. 


పైనాపిల్ తినడం ముఖ్యమా?
మనదేశంలో వానాకాలంలో దొరికే పండ్లు పైనాపిల్. విటమిన్ సి నిండుగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో పొటాషియం, సోడియం నిల్వలు అధికం. పైనాపిల్ తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి రావు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. జీవక్రియను మెరుగుపరచడంలో ఇది ముందుంటుంది. జుట్టు, గోళ్లు, చర్మాన్ని మెరిపిస్తుంది. ఈ పండులో బ్రొమెలైన్ అని పిలిచే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు, శరీరంలో వాపులాంటివి రాకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు పట్టేయకుండా కాపాడుతుంది. క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటుంది. 


Also read: చినుకు పడగానే విజృంభిస్తున్న టైఫాయిడ్, ఇది అంటువ్యాధి, ఈ జాగ్రత్తలు తీసుకోకతప్పదు


Also read: కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, బూస్టర్ డోసు తీసుకున్నా సరే వీళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే