YS Jagan Srikakulam Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం జగన్ నేడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అమ్మ ఒడి పథకం నిధులు విడుదల కార్యక్రమం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభమైంది. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున ఏపీ సీఎం జగన్ జమ చేయనున్నారు. కానీ సీఎం పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చిన వారిని సీఎం భద్రతా చర్యలలో భాగంగా టౌన్ ఔట్ కట్స్ లో బస్సులు నిలిపివేస్తున్నారు. దాంతో నాలుగు కిలోమీటర్లు నడుచుకొని చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సభలు ఓకే.. కానీ సామాన్యులకు ఇబ్బందులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం చేరుకున్నారు. జగనన్న అమ్మ ఒడి మూడో విడుత నగదు విడుదల చేయనున్నారు. కోడి రామ్మూర్తి స్టేడియానికి సీఎం చేరుకుని అమ్మ ఒడి పథకం నిధులపై ప్రసంగిస్తున్నారు. అయితే శ్రీకాకుళంలో సీఎం ప్రోగ్రాం ఇలాంటి బహిరంగసభలు పెట్టేటప్పుడు మాలాంటి ప్రయాణికులను ఇంత ఇబ్బంది పెట్టడం సరికాదని చెబుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాహనాలకు అనుమతి లేకపోవడంతో లగేజ్ లు మోసుకుంటూ నడుచుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినప్పటికీ.. పట్నం చిన్నది కావడం, ఇరుకు రోడ్ల కారణంగా  వాహనాలను లోపలికి అనుమతించడం కష్టమవుతుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. వికలాంగులు సైతం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఆగిపోతున్నారని సమాచారం.


సొమ్మసిల్లిన విద్యార్థులు
సీఎం జగన్ హాజరైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక చిన్నారులు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. కనీస సౌకర్యాలను సైతం గాలికి వదిలేసి చిన్నారులను సభకు రప్పించడంతో ఇలా జరిగిందని శ్రీకాకుళం వాసులు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మీద ఉన్న శ్రద్ధ పిల్లలపైన లేకపోవడం  ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి.


శ్రీకాకుళంలో అమ్మఒడికి శ్రీకారం 
ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జూన్ 27వ తేదీన లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బటన్‌ నొక్కి సీఎం వైఎస్‌ జగన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం అందిస్తున్న రూ. 6,595 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద దాదాపు రూ. 19,618 కోట్లు అందించింది ప్రభుత్వం. 


కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం 
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఉన్న వేళ తనకు అవమానం జరిగిందని, దాన్ని భరించలేనంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కారు వద్దకు వచ్చి మాజీ మంత్రి, ధర్మాన కృష్ణదాస్ బతిమిలాడినా సరే తాను రాను అంటూ కృపారాణి భీష్మించుకుని కూర్చున్నారు. తనకు జరిగిన సన్మానం చాలని, ఇక అవమానాలు భరించలేనని ధర్మానకు చెప్పి కారులో వెళ్లిపోయారు. 


Also Read: Killi Kruparani: కిల్లి కృపారాణికి ఘోర పరాభవం! కాసేపట్లో సీఎం జగన్ పర్యటన, ఇంతలో అలిగి వెళ్లిపోయిన నేత