మాజీ కేంద్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అయిన కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఉన్న వేళ తనకు అవమానం జరిగిందని, దాన్ని భరించలేనంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కారు వద్దకు వచ్చి మాజీ మంత్రి, ధర్మాన కృష్ణదాస్ బతిమిలాడినా సరే తాను రాను అంటూ కృపారాణి భీష్మించుకుని కూర్చున్నారు. తనకు జరిగిన సన్మానం చాలని, ఇక అవమానాలు భరించలేనని ధర్మానకు చెప్పి కారులో వెళ్లిపోయారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ లో తన పేరు ఉన్నప్పటికీ తనను కావాలనే రానివ్వకుండా చేశారంటూ ఆమె ఆవేదన చెందారు. తాను ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతుంటే తనకు తగిన విలువ ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో తనకు ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి వైదొలిగారు.


‘మీ అభిమానం చాలు..’ అంటూ కృపారాణి వెనుదిరిగారు. అక్కడున్న నేతలు సముదాయించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ‘‘కృపారాణి ఎవరో కలెక్టర్ కి తెలియదా? శ్రీకాకుళం జిల్లాలో కృపారాణిని ఎలా మర్చిపోతారు? నేను కేంద్ర మంత్రివర్గంలో చేసిన తొలి బీసీ మహిళను. అలాంటి కృపారాణినా మర్చిపోయేది?’’ అంటూ అక్కడున్న నేతలపై కృపారాణి ఫైర్ అయ్యారు.


శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం జగన్ నేడు జిల్లాలో పర్యటించారు. ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన అమ్మ ఒడి పథకం నిధులు విడుదల కార్యక్రమం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభమైంది. అయితే, సీఎం పర్యటనతో శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చిన వారిని సీఎం భద్రతా చర్యలలో భాగంగా టౌన్ ఔట్ కట్స్ లో బస్సులు నిలిపివేస్తున్నారు. దాంతో నాలుగు కిలోమీటర్లు నడుచుకొని చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సభలు ఓకే.. కానీ సామాన్యులకు ఇబ్బందులు
అయితే, శ్రీకాకుళంలో సీఎం ప్రోగ్రాం ఇలాంటి బహిరంగసభలు పెట్టేటప్పుడు మాలాంటి ప్రయాణికులను ఇంత ఇబ్బంది పెట్టడం సరికాదని చెబుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాహనాలకు అనుమతి లేకపోవడంతో లగేజ్ లు మోసుకుంటూ నడుచుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినప్పటికీ.. పట్నం చిన్నది కావడం, ఇరుకు రోడ్ల కారణంగా  వాహనాలను లోపలికి అనుమతించడం కష్టమవుతుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.