రోజూ గుడ్డు తింటే బరువు పెరిగిపోమూ... అంటూ దీర్ఘాలోచనలు చేయకండి. ఒక్క గుడ్డు వల్ల మీరేమీ ఊబకాయం బారిన పడరు, బరువు పెరగరు, సరికదా ఆరోగ్యంగా తయారవుతారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు గుడ్డు చాలా అవసరం. ఇందులో వారి పెరుగుదలకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే రోజూ ఉదయాన అల్పాహారంలో భాగంగా వారికి ఉడికించిన గుడ్డును తినిపించండి. భవిష్యత్తులో వచ్చే ఎన్నో రోగాలను తట్టుకునే శక్తి వారికి అందించినవారవుతారు. గుడ్డులోని శక్తి అందిరకీ చేరాలనే దాన్ని శాకాహారంగా ప్రకటించాలనే ఉద్యమం కూడా కొన్నాళ్లు నడిచింది. కోడి గుడ్డు రోజూ తినడం వల్ల కలిగే ఉపయోగాలేంటో మీరే చదవండి.
ఇవీ లాభాలు...
1. గుడ్డులో ఎక్కువ క్యాలరీలు ఉండవు. కాబట్టి బరువు పెరుగుతారేమోనన్న భయం పెట్టుకోవద్దు. గుడ్డు 80 క్యాలరీ శక్తిని అందిస్తుంది. కాబట్టి పిల్లలకు రోజూ గుడ్డును తినిపించవచ్చు.
2. మెదడును శక్తివంతంగా మార్చే ఆహారాలలో గుడ్డు కూడా ఒకటి. గుడ్డు సొనలో కోలిన్ అనే పోషకపదార్థం ఉంది. ఇది మెదడు కణాలను కాపాడుతుంది. సమాచారం గ్రహించే శక్తిని పెంచుతుంది. కాబట్టి గుడ్డు తినే పిల్లలకు చదువు కూడా బాగానే వస్తుంది.
3. గుడ్డులో ఉండే ఇనుమును మన శరీరం చాలా తేలికగా శోషించుకోగలదు. పిల్లలకు ఐరన్ చాలా అవసరం. అలాగే గర్భిణీస్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవాలి.
4. పిల్లలు జుట్టు ఆరోగ్యంగా ఎదగాలన్న గుడ్డు అవసరం. ఇందులో ఉండే సల్ఫర్, లవణాలు, పలురకాల విటమిన్లు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి.
5. గుడ్డులో ప్రోటీన్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. చిన్నప్పట్నించే రోజూ గుడ్డు తినే అలవాటున్న పిల్లలు... టీనేజీ వయసుకొచ్చేసరికి బలంగా, అందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇలా చేయకండి
1. గుడ్డు బాగా ఉడికించాకే పిల్లలకు తినిపించండి. సగం ఉడికిన గుడ్డులో కొన్ని రకాల బ్యాక్టిరియాలు ఉండే అవకాశం ఉంది.
2. పిల్లలకు పచ్చి గుడ్డు తినిపించకండి. తెల్లసొనలో ఎవిడిన్ అనే ఓ ప్రోటీన్ ఉంటుంది. అది బి విటమిన్ ను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది.
3. ఫుడ్ ఎలర్జీ ఉన్న పిల్లలకు గుడ్డు పడుతుందో లేదో ముందు తెలుసుకుని... అప్పుడు తినిపించండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే