Intermittent Fasting Linked To Risk Of Death : బరువు అనేది ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది బరువు తగ్గేందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది బరువు కూడా తగ్గారు. ఫిట్​నెస్ విషయంలో మంచి మార్పులు చూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల గుండె సమస్యలు వస్తాయని షాకింగ్ విషయాన్ని తెలిపింది తాజా అధ్యయనం. బరువు తగ్గడం తర్వాత కానీ.. మీరు చేసే ఫాస్టింగ్​ వల్ల గుండె జబ్బులు వస్తాయని తెలిపింది. 


ఇరవై వేల మందిపై అధ్యయనం..


అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే కోసం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ద్వారా డేటాను సేకరించింది. 2003 నుంచి 2018 వరకు సుమారు ఇరవై వేల మందిపై అధ్యయనం చేసింది. సగటు వయసు 49 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల ఆహార విధానాలను ట్రాక్ చేసింది. దీనిలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. అయితే రోజు మొత్తంలో తమ భోజన సమయాలను కేవలం ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితి చేసిన వారు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 91 శాతం ఉన్నట్లు ఈ స్టడీలో వెల్లడైంది. 


చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ


బరువు తగ్గడానికి ఫాలో అయ్యే కొన్ని రకాల జీవనశైలి విధానాలు ఆరోగ్యంపై ప్రతికూలంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయని గతంలో కూడా తెలిపారు. అయితే తాజాగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల 91 శాతం గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం ఉందని తెలిపి అందరినీ షాక్​కి గురిచేసింది. బరువు తగ్గడానికి నిర్దేశించిన ఈ ఫాస్టింగ్​ చేసేవారు రోజుకు 12 నుంచి 16 గంటల పాటు ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేస్తున్నారు. రోజుకు 24 గంటల ఉండగా.. కేవలం 8 గంటల మాత్రమే మాత్రమే భోజనానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. 


బరువు తగ్గడానికి ఫుడ్ కంట్రోల్ చేయడం మంచిదే కానీ.. ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్తుంది తాజా అధ్యయనం. ఈ అధునాతమైన ఫాస్టింగ్ పద్ధతి.. తీవ్రమైన ఆరోగ్య ప్రమాదంగా మారుతుందని చెప్తోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఎనిమిది గంటల సమయం పాటిస్తూ.. ఆహారాన్ని తీసుకునే వారు.. రోజుకు 12 నుంచి 16 గంటల సాధారణ సమయ వ్యవధిలో తినేవారి కంటే హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 91 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 


క్యాన్సర్ ఉంటే ఇంకా ప్రమాదం..


గుండె జబ్బులు లేదా క్యాన్సర్​తో ఇబ్బంది పడేవారిలో కూడా హృదయనాళ మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. రోజుకు ఎనిమిది నుంచి 10 గంటల మధ్య ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ సమస్యలు ఉన్నవారు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే 66 శాతం ఎక్కువ ప్రమాదముంటుందని గుర్తించారు. క్యాన్సర్​తో ఇబ్బంది పడేవారు రోజుకు 16 గంటలకు పైగా తినే ఆహారం షెడ్యూల్ ప్లాన్ చేసకుంటే క్యాన్సర్ మరణాల ప్రమాదం తగ్గిస్తుందని తెలిపారు. 


బెనిఫిట్స్ ఉన్నా సరే..


ఈ అధ్యయనం ఆధారం చేసుకుని మరిన్ని స్టడీలు జరగాలని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండేవారు.. వారి జీవనశైలి వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని మరిన్ని అధ్యయనాలు దీనిపై చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపరుస్తుందని ఇదే పరిశోధనలో తేలింది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు.. క్యాన్సర్​తో ఇబ్బంది పడేవారికి దీనివల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపింది. మీరు ఇలాంటి డైటింగ్స్ చేస్తే కనుక వెంటనే వైద్యులను సంప్రదించి దానిని కంటిన్యూ చేయాలో వద్దో నిర్ణయం తీసుకోండి.


Also Read : ఇంటర్నేషనల్ ఓరల్ హెల్త్ డే.. సెప్టెంబర్​లో చేసుకోవాల్సిన డేని మార్చిలోకి ఎందుకు మార్చేశారో తెలుసా?







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.