Andhra Pradesh News: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏ చోట విన్నా ఇదే డిస్కషన్. ఎక్కడ చూసిన ఇదే చర్చ. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే రాజకీయం రంగు అంటుకుంటోంది. అలాంటి ఎఫెక్టే మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో కూడా పడింది. అయితే ఎక్కడా నేరుగా పార్టీల  ప్రస్తావన లేకుండా పరోక్షంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చి జనంలో చర్చ లేవదీశారు. 


తిరుపతిలో మోహన్ బాబు జన్మదిన వేడుకలు


తిరుపతిలో ఎంబీయూలో జరిగిన నటుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు హీట్‌ను పుట్టించాయి. మోహన్‌బాబుసహా ఆయన కుమారుడు మనోజ్ కూడా పొలిటికల్ స్పీచ్‌ దంచేశారు. ప్రజలకు సూచనలు చేస్తున్నట్టే జరుగుతున్న రాజకీయాలను తూర్పారబట్టారు. నచ్చిన వారికి ఓటు వేసుకోండి అని చెబుతూనే ఎవరికి వేయాలో కూడా చెప్పేశారు. 


మోదీని పొగుడ్తూ మోహన్ బాబు కామెంట్స్ 


జన్మదిన వేడుకల్లో మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండి." అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 


మనోజ్ స్పీచ్‌తో హీట్


అంతకంటే ముందు మాట్లాడిన మంచు మనోజ్‌ కూడా రాజకీయ ప్రసంగం చేశారు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదో చెప్పుకొచ్చారు. "పదిమంది కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి. వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు.వాళ్ల చుట్టుపక్కల వారికే హెల్ప్ చేయనివాళ్లు. మీకేం హెల్ప్‌  చేస్తారు. అది గుర్తుపెట్టుకొని... కరెక్ట్‌గా చూజ్‌ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. కష్టాల్లో ఉండి ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్లు ఉంటే వద్దని మీకు చెప్పను. ఆ డబ్బు ఇచ్చాడని ఓటు వేయొద్దు. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండని" చెప్పారు. 


మనోజ్ స్పీచ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. టీడీపీ, వైసీపీ వాళ్లు ఒకరికనొకరు నిందించుకొని ఆ వీడియోను రెండు గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. మనోజ్‌ జగన్‌ను నేరుగా విమర్శించకపోయినా  టీడీపీకి సపోర్ట్ చేసారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓ వైపు మోహన్ బాబు మోదీకి ఓటు వేయాలని చెబితే... మనోజ్‌ టీడీపీకి సపోర్ట్ చేశారని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు తండ్రీకుమారులు కూటమికి మద్దతు తెలియజేశారనే విశ్లేషణ వినిపిస్తోంది. 


2019లో అలా 2024లో ఇలా


2019 ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించింది. నేరుగా చంద్రబాబును విమర్శించిన మోహన్ బాబు.. జగన్‌తో కలిసి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకు సైలెంట్‌ అయిపోయారు. తర్వాత మోదీకి మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఓటు వేయాలని సూచిస్తున్నారు. 


శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ 32వ వార్షికోత్సవంతోపాటు,  మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు.