Abraham Ozler review in Telugu starring Jayaram and Mammootty: మలయాళ నటుడు జయరామ్ తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం'లో మహేష్ బాబు తండ్రి పాత్రలో నటించారు. అంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలు చేశారు. అనువాద సినిమాలతో మన ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. సంక్రాంతికి మలయాళంలో (జనవరి 11న) ఆయన హీరోగా నటించిన 'అబ్రహం ఓజ్లర్' విడుదలైంది. అందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.


కథ: Abraham Ozler (జయరామ్) ఏసీపీ. ఫ్యామిలీతో కలిసి మున్నార్ వెళతాడు. ఓ ఫోన్ వస్తుంది... కేసు విషయంలో మీ సహాయం అవసరం అంటూ పోలీస్ స్టేషన్ నుంచి! దారిలో ఉండగా ఆ ఫోన్ పోలీసుల నుంచి కాదని అర్థం అవుతుంది. వెనక్కి తిరిగి వెళితే భార్య, కుమార్తె మిస్సింగ్. మూడేళ్లు గడిచినా ఆచూకీ లభించలేదు. ఆ కేసు గురించి ఆలోచిస్తూ అబ్రహం సరిగా నిద్రపోడు. అది పక్కన పెడితే...


సర్జికల్ బ్లేడుతో గాయం చేయడం ద్వారా వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత అబ్రహం ఓజ్లర్ (Abraham Ozler Review In Telugu) మీద పడుతుంది. ఐటీ ఉద్యోగి, ఛోటా రౌడీ, హోటల్ యజమాని... ముగ్గుర్ని ఒకే విధమైన పద్ధతిలో కిల్లర్ చంపుతాడు. ఆ ముగ్గురి మధ్య సంబంధం ఏమిటి? నాలుగో హత్యను చేయకుండా అబ్రహం ఆపగలిగాడా? లేదా? ఈ కేసుకు... అలెగ్జాండర్ (మమ్ముట్టి), కృష్ణదాస్ (సైజు కురుప్)కి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Abraham Ozler review): 'ఠాగూర్'లో ఉన్నతాధికారికి ప్రకాష్ రాజ్ కేసు గురించి వివరించిన తర్వాత '90 పర్సెంట్ కేసు పూర్తి చేశావ్ కదయ్యా' అని చెబుతారు. ఈ సినిమాలో మమ్ముట్టి అరెస్ట్ (ఇంటర్వెల్ బ్యాంగ్) సన్నివేశానికి వచ్చేసరికి '90 శాతం సినిమా అయిపోయింది కదయ్యా' అనిపిస్తుంది. అప్పటి నుంచి థ్రిల్లర్ సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. థ్రిల్లర్ ప్లస్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్న చిత్రమిది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Abraham Ozler OTT Platform) విడుదలైన 'అబ్రహం ఓజ్లర్' మెడికల్ బ్యాక్ డ్రాప్ కథతో నడిచే థ్రిల్లర్. అయితే... ప్రారంభం మాత్రం ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అన్నట్లు ఉంటుంది. భార్య, కుమార్తె మిస్సింగ్ కేసును సాల్వ్ చేయలేని స్థితిలో ఏసీపీ నిద్రలేమి (insomnia)కి లోను కావడం వంటి సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నాయి. ఐటీ ఉద్యోగి హత్యతో కదలిక వచ్చింది. ఆ తర్వాత వరుస హత్యలు, ఇన్వెస్టిగేషన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. కానీ, ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. మమ్ముట్టి అరెస్ట్ సమయానికి హత్యలు ఎవరు చేశారు? అనేది క్లారిటీ వస్తుంది. ఎందుకు చేశారు? అనేది చెప్పడానికి గంటకు పైనే టైం తీసుకున్నారు. అయితే... అక్కడ థ్రిల్ కంటే ఎక్కువ మమ్ముట్టి స్క్రీన్ ప్రజెన్స్, సాంగ్స్, కోర్ ఎమోషనల్ పాయింట్ కనెక్ట్ అవుతుంది.


Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?


దర్శక రచయితలు మిథున్ మాన్యుల్ థామస్, డాక్టర్ రణధీర్ కృష్ణన్ ఎంపిక చేసుకున్న కథాంశం బాగుంది. కానీ, కథనం ఆసక్తికరంగా లేదు. సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయి. కానీ, కంటిన్యూగా ఎంగేజ్ చేసే అంశాలు లేవు. రెగ్యులర్ & రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తరహాలో తీశారు. సంగీతంలో 'నీలి మేఘమే మృదు రాగమై కురిసే...' పాట బావుంది. మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ బావున్నాయి.


కథానాయకుడిగా తన పాత్రకు జయరామ్ న్యాయం చేశారు. ఇన్సోమ్నియా వ్యక్తిగా ఎందుకు చూపించారో అర్థం కాదు. మమ్ముట్టిది అతిథి పాత్ర అని చెప్పలేం. స్క్రీన్ మీద ఆయన కనిపించకున్నా... ఆయన ప్రజెన్స్ ఉన్నట్లు ప్రేక్షకులు ఫీలయ్యేలా ఫ్లాష్ బ్యాక్ తీశారు దర్శకుడు. సుజా జయదేవ్ పాత్రలో అనశ్వర రాజన్ నటన, రూపం బావున్నాయి. మిగతా నటీనటులు పర్వాలేదు. తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.


న్యూ ఏజ్ మెడికల్ / ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలా మొదలైన 'అబ్రహం ఓజ్లర్'... ఓ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత రొటీన్ రివేంజ్ ఫార్ములా డ్రామాగా మారింది. కొత్త సీసాలో పాత సారాయిగా అనిపిస్తుంది. జయరామ్, మమ్ముట్టి నటన బాగుంది. అయితే... నో థ్రిల్స్‌, ఓన్లీ ఎమోషనల్‌ మూమెంట్స్‌! ఓటీటీలో అందుబాటులో ఉంది కనుక టైంపాస్ కోసం ఓ లుక్ వేయవచ్చు.


Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?