Horror Movie Tantra Movie Review: తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజల నేపథ్యంలో చిత్రాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది. 'మసూద', 'విరూపాక్ష' వంటివి భారీ విజయాలు సాధించాయి. ఆ జానర్ సినిమా 'తంత్ర' థియేటర్లలో విడుదలైంది. 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాల ఫేమ్ అనన్యా నాగళ్ల నటించడం, ప్రచార చిత్రాల్లో దృశ్యాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మరి, ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది? భయపెడుతుందా? లేదా? అనేది రివ్యూ చూసి తెలుసుకోండి.


కథ (Tantra Movie Story): రేఖ (అనన్యా నాగళ్ల)కి దెయ్యాలు కనిపిస్తాయి. తల్లిని చిన్నతనంలో కోల్పోయిన ఆమె... తండ్రితో ఎప్పుడూ తిట్లు తింటుంది. చిన్నప్పటి నుంచి స్నేహితుడైన తేజా (ధనుష్ రఘుముద్రి) అంటే రేఖకు ప్రేమ. అతడూ ఆమెను ప్రేమిస్తాడు. అయితే... రేఖ మీద ఎవరో క్షుద్రపూజలు చేశారని తేజా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. 


ప్రతి పౌర్ణమి నాడు రక్తదాహంతో తపించే ఆత్మ / పిశాచి రేఖ దగ్గరకు ఎందుకు వస్తుంది? 18 ఏళ్లు ఊరికి దూరంగా ఉన్న విగతి ('టెంపర్' వంశీ), మళ్లీ  వచ్చిన తర్వాత రేఖకు కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? రాజేశ్వరి (సలోని) ఎవరు? వజ్రోలి రతిని ఎవరు ఎవరి మీద ప్రయోగించారు? రేఖను కాపాడటం కోసం తేజా ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Tantra Telugu Review): హారర్ థ్రిల్లర్ తీసేటప్పుడు దర్శక రచయితలకు ఓ సౌలభ్యం ఉంటుంది. కథను మొదటి సన్నివేశం నుంచి చిన్న పిల్లలకు అరటి పండు వలిచినట్లు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ నెక్స్ట్? తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుంది? అని ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగించేలా చెబితే హిట్టే! పతాక సన్నివేశాలకు ముందు ట్విస్టులు రివీల్ థ్రిల్ ఇస్తాయి. ఎటువంటి ఆసక్తి లేకుండా మొదటి సన్నివేశం నుంచి కథ ముందుకు వెళ్లడం 'తంత్ర'లో స్పెషాలిటీ.


రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి... 'తంత్ర'లో ఆరు అధ్యయాలు ఉన్నాయి. ఆ పేర్లు పెట్టడం వల్ల కథకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ముసుగులో మహంకాళి వంటి పేర్లు, కొన్ని సంభాషణలు కథను కామెడీ చేశాయి. ఎటువంటి పేర్లు లేకుండా నేరుగా కథను చెబితే మరింత ఎఫెక్ట్ వచ్చేది. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు నేపథ్యంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే పాయింట్ రాసుకున్నారు. కానీ, దర్శకత్వంలో సీరియల్ కంటే స్లోగా తీశారు.


'తంత్ర' ప్రారంభం సాధారణంగా ఉంది. అనన్యకు దెయ్యాలు కనిపించడం తప్ప ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమీ లేదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో పాటు క్షుద్ర పూజల గురించి చెప్పే విషయాలు ఆసక్తి కలిగించవు. ఒక్క హారర్ మూమెంట్, థ్రిల్ ఇచ్చే సన్నివేశం లేవు. ఏదో అలా అలా సోసోగా ముందుకు వెళుతుంది. సలోని లవ్, మ్యారేజ్ ట్రాక్ అయితే మరింత విసిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో ట్విస్టులు రివీల్ చేశారు. కానీ, అప్పటికి ఆలస్యం అయ్యింది. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. కానీ, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అది వృథా ప్రయాస అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి.


Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?


శ్రీహరి సోదరుని కుమారుడు ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తక్కువ స్క్రీన్ స్పేస్ లభించినప్పటికీ... తనలో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. రేఖగా మెయిన్ లీడ్ రోల్ చేశారు అనన్యా నాగళ్ల. పాత్ర పరిధి మేరకు నటించారు. పతాక సన్నివేశాల్లో ఆమెకు నటించే స్కోప్ దక్కింది. బాగా చేశారు. సలోని రోల్, ఆ సీన్స్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరుల నటన వల్ల ఆయా పాత్రలు రిజిస్టర్ అయ్యాయి. 


'తంత్ర' కథ బావుంది. కానీ, కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఎంత సేపటికీ ముందుకు కదలదు. సన్నివేశాల్లో కొత్తదనం లేదు. అనన్యా నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని నటన బావుంది. అయితే, సినిమాను నిలబెట్టలేకపోయింది. కొన్ని కథలు ఐడియా లెవల్‌లో బావుంటాయి. కానీ, ఎగ్జిక్యూషన్ విషయం బోల్తా కొడతాయి. పేపర్ మీద మంచిగా కనిపించిన ఐడియా, సన్నివేశాలను పర్ఫెక్ట్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసుకురావడంలో దర్శక రచయితలు ఫెయిల్ అవుతారు. 'తంత్ర' కూడా అటువంటి చిత్రమే. నో హారర్, నో థ్రిల్స్, ఫుల్ ల్యాగ్! ఈ సినిమాను అవాయిడ్ చేయడం మంచిది.


Also Readసేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?