Razakar Movie Review Rating In Telugu: 'రజాకార్' ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులకు కథా నేపథ్యం, కథాంశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మాన ప్రాణ త్యాగాలకు సిద్ధపడి... స్వాతంత్య్రం కోసం నిజాం రాజు, ఖాసీం రజ్వీ రజాకార్ల వ్యవస్థపై తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటాన్ని తెరకెక్కించిన చిత్రమిది. నేడు థియేటర్లలో విడుదలైంది. కె. రాఘవేంద్రరావు శిష్యుడు, సూపర్ హిట్ సీరియళ్లు తీసిన యాటా సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.


కథ (Razakar movie story): భారతావని 1947లో స్వాతంత్య్రం సాధించుకుంది. హైదరాబాద్ సంస్థానాన్ని తామే స్వాతంత్య్ర రాజ్యంగా పాలించుకుంటామని, భారతదేశంలో కలిసేది లేదని ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్‌పాండే) స్పష్టం చేస్తాడు. అతని అండతో ఖాసీం రజ్వీ (రాజ్ అర్జున్) రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసి హిందువులపై దాడులకు తెగబడ్డారు. ఇస్లాం స్వీకరించమని హిందువులను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. లేదంటే నలుగురిలో మహిళలను వివస్త్ర చేసి మాన ప్రాణాలు తీయడం, పురుషులను అత్యంత పాశవికంగా చంపడం పనిగా పెట్టుకున్నారు.


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో హిందువులపై రజ్వీ ఆగడాలు, మతోన్మాద దాడులు రోజు రోజుకూ పెరగడంతో ప్రజల నుంచి అంతే స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో ఏయే ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి పోరాటం చేశారు? హైదరాబాద్‌ను మరో కశ్మీర్ కానివ్వనని చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజ్ సప్రు), భారతదేశంలో విలీనం చేయడం కోసం ఏం చేశారు? ఆపరేషన్ పోలో, పోలీస్ చర్యకు ముందు నెహ్రూ, పటేల్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి? చివరకు భారతదేశంలో హైదరాబాద్ ఎలా భాగమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Razakar review Telugu): తెలంగాణ చరిత్రను రాస్తే మహాభారతం అంత ఉంటుందేమో!? అంతకు మించినా ఆశ్చర్యం అవసరం లేదు. పోరాటయోధులు ప్రతి ఊరిలో ఉన్నారు. ఆ చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం సాహసమే. ఆ బాధ్యతను దర్శక రచయిత యాటా సత్యనారాయణ చాలా వరకు సమర్థవంతంగా నిర్వహించారు. అయితే... పోరాటాలు అన్నిటినీ ఒక్క కథలో క్లుప్తంగా చెప్పడంలో ఒత్తిడికి లోనైనట్లు అనిపించింది.


తెలంగాణ ప్రజలపై రజాకార్లు సాగించిన మతోన్మాద మారణకాండను వెండితెరపై కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించడంలో యాటా సత్యనారాయణ విజయం సాధించారు. ఆ దమనకాండ చూస్తే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. అప్పటి ప్రజలు అన్ని కష్టాలు పడ్డారా? అని చరిత్ర తెలియని ఈతరం చలిచిపోయేలా కొన్ని సన్నివేశాలు తీశారు.


ఓ ఎపిసోడ్ తర్వాత మరో ఎపిసోడ్ వచ్చి వెళుతున్నట్లు ఉంటుంది తప్ప... స్టార్ట్ టు ఎండ్ ఒక కథగా 'రజాకార్' కనిపించదు. ఐలమ్మ ఎపిసోడ్, బాబీ సింహా బైరాన్ పల్లి ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తాయి. తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టాలను ఒక్కతాటిపై చెప్పే క్రమంలో ప్రేక్షకుడికి ఓ కథగా, సినిమాగా ఎమోషనల్ కనెక్టివిటీ ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. అప్పటి దురాగతాలను తెరపై తక్కువ చేసి చూపించినా... సన్నివేశాల్లో మితిమీరిన హింస ఉన్నట్లు అనిపిస్తుంది. 


కొందరు ముస్లింల మీద సైతం ఖాసీం రజ్వీ దారుణాలకు తెగబడ్డారు. అతడికి వ్యతిరేకంగా వాళ్లూ తిరగబడ్డారు. నిజాంకు తొత్తులుగా మారిన కొందరు దొరలపై హిందువులూ విరుచుకుపడ్డారు. వాటినీ తెరపై చూపించారు. అయితే, ప్రధానంగా హిందువులపై ఖాసీం రజ్వీ, రజాకార్లలోని ముస్లింలు చేసిన మారణకాండ సినిమాలో హైలైట్ అయ్యింది. చరిత్రను పక్కనపెడితే... హిందూ, ముస్లింల మధ్య మతఘర్షణలు చెలరేగేలా సినిమా తెరకెక్కించారని విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. తమ సాయుధ పోరాటాన్ని ఒక్క మాటకు పరిమితం చేసి, పటేల్ ఖాతాలో ఎక్కువ క్రెడిట్ వేయడం కమ్యూనిస్టులకు నచ్చని విషయమే.


Also Read: సేవ్ ద టైగర్స్ 2 రివ్యూ: సూపర్ హిట్‌కు సీక్వెల్ - హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్ నవ్విస్తుందా? లేదా?


కథ, కథనం, దర్శకత్వం పక్కనపెడితే... సాంకేతికంగా ఉన్నతంగా ఉందీ సినిమా. నిర్మాత గూడూరు నారాయణరెడ్డి ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. భారీ సినిమాకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో 'రజాకార్'ను తీశారు. తెరపై అప్పటి కాలాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ప్రొడక్షన్ డిజైనర్ తిరుమల్ రెడ్డి. కెమెరా వర్క్ బావుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించింది. పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఎక్స్‌ట్రాడినరీ.


Also Readబ్రీత్ రివ్యూ: నందమూరి చైతన్యకృష్ణ సినిమా థియేటర్లలో డిజాస్టర్... మరి, ఓటీటీలో చూసేలా ఉందా?


నిజాంగా మకరంద్ దేశ్‌పాండే ఒదిగిపోయారు. ఖాసీం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ క్రూరత్వం పలికించారు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ వదలకూడదు అన్నంత కసి ప్రేక్షకుడిలో కలిగించేలా నటించారంటే అతిశయోక్తి కాదు. పటేల్ పాత్రలో రాజ్ సప్రు నటన బావుంది. ఇంద్రజ, ప్రేమ, అనసూయ, వేదిక, బాబీ సింహా, అనుష్య త్రిపాఠి, జాన్ విజయ్... ఇలా చెబుతూ వెళితే తెరపై కీలక పాత్రల్లో పేరున్న నటీనటులు చాలా మంది కనిపించారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చారు. ఆర్టిస్టులు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.


'రజాకార్'... తెలంగాణ చరిత్రకు, హిందువులపై మతోన్మాద ఖాసీం రజ్వీ సాగించిన మారణకాండకు దృశ్యరూపం. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కొరుకునే ప్రేక్షకులకు కొన్ని లోపాలు కనిపిస్తాయి. చరిత్రను తమకు అనుకూలంగా తెరకెక్కించారని విమర్శలూ ఉంటాయి. అయితే... దీనిని సినిమాగా కాకుండా చరిత్రగా చూస్తే ఆ కాలంలో జరిగిన కొన్ని ఘటనలు మనసుల్ని కదిలిస్తాయి.


Also Readశపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?