Sapatham Movie Review - శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?

Sapatham Movie Review In Telugu: వర్మ 'వ్యూహం' థియేటర్లలో విడుదలైంది. దానికి సీక్వెల్ 'శపథం' ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేశారు. వర్మ వెబ్ సిరీస్‌గా పేర్కొన్న ఈ 'శపథం' ఎలా ఉందో రివ్యూలో చూడండి.

Continues below advertisement

Sapatham web series chapter 1 review directed by RGV: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' థియేటర్లలో విడుదలైంది. సినిమాకు సెన్సార్ ఉంటుంది కనుక రాజకీయ నాయకుల పేర్లు మారాయ్. సెన్సార్ కత్తెర నుంచి 'వ్యూహం' బయటకు రావడంతో డైరెక్ట్ టార్గెట్ వంటివి కొంత వరకు తగ్గినట్లు అనిపించింది.

Continues below advertisement

Also Read: మదనే జగన్, శ్రవణే పవన్ - వర్మ 'వ్యూహం'లో పేర్లు మారాయ్, ఎవరి క్యారెక్టర్ ఏదో తెలుసుకోండి

'వ్యూహం' సీక్వెల్ 'శపథం'ను థియేటర్లలో కాకుండా ఏపీ ఫైబర్ నెట్ (ఓటీటీ)లో విడుదల చేశారు. సెన్సార్ లేకపోవడంతో వర్మ క్రియేటివిటీకి బ్రేకులు పడలేదు. దాంతో స్వేచ్ఛ లభించిందని 'శపథం' ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకుడికి అర్థం అవుతూ ఉంటుంది. మరి, ఈ సినిమా / వర్మ దృష్టిలో వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ (Sapatham movie story): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఏపీ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నారా చంద్రబాబు (ధనుంజయ ప్రభునే) అరెస్ట్ వరకు రాష్ట్ర రాజకీయాల్లో జరిగినది ఏమిటి? అనేది కథ.

చంద్రబాబును 2014 ఎన్నికల్లో తిట్టిన పవన్ కళ్యాణ్ (చింటూ), మళ్ళీ ఆయనతో పొత్తుకు సిద్ధం కావడం వెనుక ఏం జరిగింది? లోకేష్ పాత్ర ఏమిటి? అనేది 'శపథం' చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Sapatham Review): అసెంబ్లీలో అపోజిషన్ ఉంటుంది. పదవిలో ఉన్న రాజకీయ నాయకుల పని తీరుపై న్యూస్ ఛానళ్లు చేపట్టే డిబేట్లలో ఇరు వర్గాలకు మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. దర్శకుడి క్రియేటివిటీకి ఆ తరహా అపోజిషన్ ఏమీ ఉండదు. పైగా, సెన్సార్ కూడా లేదు. దాంతో రామ్ గోపాల్ వర్మకు అడ్డు లేకుండా పోయింది. ఆయన క్రియేటివిటీకి అడ్డుకట్ట వేసేవారు అసలే లేరు. దాంతో తన ఊహాకు మరింత పదును పెట్టారు. స్వేచ్ఛగా తాను చెప్పాల్సిన కథను చెప్పేశారు. 

'శపథం'ను కథగా లేదంటే వెబ్ సిరీస్ / సినిమాగా పేర్కొనడం కంటే రెండు గంటల రాజకీయ ప్రచార చిత్రంగా పేర్కొనడం సబబు. రామ్ గోపాల్ వర్మ గతంలో తీసిన పొలిటికల్ బేస్డ్ సినిమాలకు, 'శపథం'కు డిఫరెన్స్ ఉంది. ఇందులో ఆయన జెండా, ఎజెండా క్లియర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాల వెనుక ఉన్నది చంద్రబాబు అని ఎటువంటి మొహమాటాలు మరింత దూకుడు చూపించారు.

రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు కనిపించడం అరుదు. ప్రతి ఒక్కరిపై ఏవో ఆరోపణలు, కేసులు ఉన్నాయి. అయితే, చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలతో నడిచిందని 'శపథం'లో వర్మ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఓటమి, తన విజయం కోసం తప్ప ఆయన మరొక విషయం ఆలోచించరన్నట్లు చూపించారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప మరొక ఉద్దేశం లేనట్టు చూపించారు. దాంతో వార్ వన్ సైడ్ అయిపొయింది. సినిమాలో డ్రామా లేకుండా పోయింది. 

'శపథం' మొత్తం చూశాక రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు? స్క్రీన్ మీద ఆయన ఏం చూపించారు? కొత్తగా ఏం చెప్పారు? అనేది ఆలోచిస్తే...

  1. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ మనసులో కక్ష సాధింపు ఉద్దేశం ఏమీ లేదు.
  2. సంక్షేమ కార్యక్రమాల్లో దోచుకోవడానికి కుదరదని కొత్త స్కీములకు తెర తీసి చంద్రబాబు స్కామ్స్ చేశారు.
  3. పవన్ కళ్యాణ్ ఒకరు చెప్పింది వినరు, భ్రమల్లో బతుకుతారు.
  4. పవన్ ఓటమికి చంద్రబాబు మరోసారి వ్యూహం పన్నుతూ... జనసేన గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవాలని భావిస్తున్నారు.
  5. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విజయమ్మ రాజకీయంగా తెరమరుగు కావడం అనేది ఆమె తీసుకున్న నిర్ణయం తప్ప జగన్ చెప్పింది, చేసిందీ ఏమీ లేదు.
  6. తెలంగాణాలో చెల్లెలు షర్మిల పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించవద్దని కుటుంబ సభ్యులకు చెప్పిన జగన్, షర్మిలకు తోడుగా ఉంటానని విజయమ్మ కోరితే అడ్డు చెప్పలేదు.
  7. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు నారా లోకేష్ ఫోనులు చేస్తే వాళ్లిద్దరూ లిఫ్ట్ చేయలేదు.
  8. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు సలహాలను పవన్ పక్కనపెట్టి జనసేనలో తాను చెప్పినదానికి జై కొట్టే నాదెండ్ల మనోహర్ కు పవన్‌ కళ్యాణ్‌ ఇంపార్టెన్స్ ఇస్తారు.
  9. చంద్రబాబుకు షర్మిల భర్త అనిల్ దగ్గరయ్యారు, రాజకీయాలకు దూరంగా ఉండాలని విజయమ్మ నిర్ణయం తీసుకున్నప్పడు షర్మిల గాబరా పడ్డారు.

వర్మ చూపింనవి నిజమా? కాదా? అనేది పక్కన పెడితే... పొలిటికల్ డ్రామాకు కావాల్సిన మలుపులు, ప్రేక్షకుల ఊహకు అందని విషయాలు సినిమాలో ఉన్నాయి. వర్మ టూ మచ్ జగన్ సైడ్ తీసుకోవడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి లేకుండా 'శపథం' నీరసంగా ముందుకు కదిలింది. రాబోయే ఎన్నికలు కాకుండా 2029లో తనను సీఎం చేయాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసే ఇంటర్వెల్ సీన్ ఒక్కటీ అటు వైసీపీ, ఇటు టీడీపీ - జనసేన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది.

వర్మ దర్శకత్వంలో శృతి మించిన జగన్ భజన, ఆయా సన్నివేశాల్లో జగన్ మీద చూపించిన భక్తి శ్రద్ధల కారణంగా ఎన్నికల ముందు పార్టీలు రూపొందించే ప్రచార చిత్రంగా మాత్రమే 'శపథం' మిగిలింది. 'వ్యూహం'లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ అభిమానులకు కల్పించిన విజిల్ మూమెంట్స్ కూడా 'శపథం'లో లేవు. 'వ్యూహం'లో తారాగణం 'శపథం'లో రిపీట్ అయ్యారు. నటన పరంగా ఆర్టిస్టుల నుంచి మెరుపులు లేవు. జగన్ ఫ్యామిలీగా కనిపించిన ఆర్టిస్టులు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవితో పాటు మిగతా ప్రముఖుల పాత్రల్లో కనిపించిన ఆర్టిస్టులు మేనరిజమ్స్ ఇమిటేట్ చేయడం ఈసారి మరీ ఎబ్బెట్టుగా అనిపించింది.

Also Read: వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?

సినిమా అంతా ఒకెత్తు... చివర్లో వచ్చే 'వెయ్యి తప్పులు చేశావ్' పాట మరో ఎత్తు. వైసీపీలో ఎంత మంది రాజకీయ నాయకులు, ఆ పార్టీకి ఎంత మంది వీరాభిమానులు ఉన్నప్పటికీ... 'శపథం'లోని ఆ పాటలో నారా చంద్రబాబు నాయుడు మీద రామ్ గోపాల్ వర్మ చేసినన్ని విమర్శలు ఎప్పటికీ చేయలేరు. స్వయంగా వర్మ ఆ సాంగ్ పాడటం విశేషం. కాల్ మనీ, అగ్రి గోల్డ్ నుంచి మొదలు పెడితే... ఏపీలో జరిగిన తప్పులన్నీ చంద్రబాబు చేశారని గొంతు చించుకుని మరీ ఆ ఒక్క పాటలో చెప్పారు. ఆ పాటలో ఆయన వినిపించిన వాయిస్ మాడ్యులేషన్స్ నభూతో న భవిష్యత్.

Also Readభీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?

ఒకవేళ చంద్రబాబు తప్పు చేయలేదని ఎవరైనా అంటే వర్మ ఒప్పుకునేలా లేరు. వాళ్లను ఒప్పించే వరకు ప్రేక్షకుల మీద సినిమాలతో దండయాత్ర చేసేలా ఉన్నారు!? ఆ దండయాత్ర ఆపకూడాదని తనకు తాను శపథం చేసుకున్నట్టు ఉన్నారు. పవన్, చంద్రబాబు తన ట్వీట్స్ గురించి డిస్కషన్ చేస్తారని తీసిన సన్నివేశాల్లో వర్మ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం 'శపథం' మొత్తానికి హైలైట్. అటువంటి రెండు మూడు మెరుపులు, 'వెయ్యి తప్పులు చేశావ్' పాట కోసం 'శపథం' చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఉంటే వాళ్లిష్టం! దీని కంటే వర్మ ట్వీట్లు ఇన్‌స్టంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. వాటిని చదవడానికి రెండు గంటల టైమ్ అవసరం లేదు... రెండు నిమిషాలు చాలు!

Also Readగామి రివ్యూ: అఘోరాగా విశ్వక్‌ సేన్ నటించిన సినిమా ఎలా ఉంది? హిట్టా

Continues below advertisement