Breathe Telugu movie review streaming on Aha Video OTT: ఎన్టీఆర్ మనవడు, జయ కృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా 'బ్రీత్'. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైంది. థియేటర్లలో జీరో షేర్ వచ్చింది. ఇప్పుడీ డిజాస్టర్‌ సినిమా 'ఆహా'లో (Breathe Aha Review) స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల థియేటర్లలో అంతగా ఆదరణ పొందని సినిమాలకు ఓటీటీ, టీవీల్లో ఆదరణ లభిస్తోంది. ఆ జాబితాలో 'బ్రీత్' చేరుతుందా? ఓటీటీలో అయినా సరే ఈ మూవీ చూడగలమా? రివ్యూలో తెలుసుకోండి.


కథ (Breathe movie story): అభి (నందమూరి చైతన్య కృష్ణ) మూడేళ్లు ఎంబీబీఎస్ చదువుతాడు. లైసెన్స్ లేకుండా ఆపరేషన్ చేసినందుకు రస్టిగేట్ చేస్తారు. ఆస్పత్రి నుంచి సస్పెండ్ అయినా చదవడం ఆపడు. మెడిసిన్ స్టూడెంట్లకు క్లాసులు చెప్పే రేంజికి వెళతాడు. బైక్ యాక్సిడెంట్ కావడంతో బ్రీత్ ఆస్పత్రిలో చేరతాడు. ఆ రోజే ముఖ్యమంత్రి ఆదిత్య వర్మను సైతం తీసుకొస్తారు.


అభి ఎవరో కాదు... సీఎం ఆదిత్య వర్మకు కొడుకు అవుతాడు. అయినా ఓ సాధారణ యువకుడిలా ఎందుకు తిరుగుతున్నాడు? సీఎంకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు నలుగురు ఎందుకు మరణించారు? బ్రీత్ ఆస్పత్రిలో చేరిన కొందరి వీఐపీలు  మరణించడం వెనుక ఎవరున్నారు? తండ్రి ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కాపాడుకోవడానికి అభి ఏం చేశాడు? అతని ప్రయత్నాలు తెలిసి కిల్లర్స్ ఏం చేశారు? అభికి అతని క్లాస్‌మేట్, బ్రీత్ ఆస్పత్రిలో డాక్టర్ కడలి (వైదిక సెంజాలియా) నుంచి ఎటువంటి సహకారం అందింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Breathe Telugu movie review): 'బ్రీత్' చూశాక తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం గుర్తొస్తుంది. ఆస్పత్రిలో 75 రోజుల పాటు చికిత్స తర్వాత ఆమె ఇక లేరని తెలిపారు. జయలలిత మరణం వెనుక పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. 'బ్రీత్' కథకు ఆ అనుమానాలు, అప్పట్లో వ్యక్తమైన సందేహాలు స్ఫూర్తి కావచ్చు.


దర్శక రచయిత వంశీకృష్ణ ఆకెళ్ల ఆలోచన బావుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో బడా నాయకులు, ప్రముఖుల మరణం వెనుక మిస్టరీ అనేది క్రైమ్ థ్రిల్లర్‌కి కావాల్సిన మాంచి మెటీరియల్ అందించింది. ఆలోచన స్థాయిలో బావున్న కథను తెరపైకి తీసుకు వచ్చే క్రమంలో చాలా తప్పులు జరిగాయి. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు లేవు. ఆసక్తి రేకెత్తించే నటీనటులు లేరు. సంగీతంలో విషయం లేదు. సినిమా తీయాలి కాబట్టి తీసినట్టు ఉంది కానీ సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినట్లు ఏ దశలోనూ అనిపించదు.


సినిమా మొదలైన కాసేపటికి ఏ రూటులో వెళుతుందో అర్థం కావడానికి ప్రేక్షకులకు ఎక్కువ సమయం పట్టదు. ఆస్పత్రిలో సీఎం ఉన్నప్పుడు సెక్యూరిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం సొంతింట్లో తిరిగినట్టు ఆస్పత్రిలో హీరో ఇష్టం వచ్చినట్లు అటు ఇటు తిరుగుతాడు. మధ్యలో ఐడీ కార్డ్స్ చెక్ చేసినట్లు చూపించినా కన్విన్సింగ్‌గా లేదు. హీరో చైన్ స్మోకర్ అన్నట్లు చూపించారు. అసలు, ఆస్పత్రిలో స్మోకింగ్ చేయొచ్చా? చేస్తే ఊరుకుంటారా? - ఇటువంటి బేసిక్ పాయింట్ దర్శకుడు మర్చిపోయారు. ఒక్కటంటే ఒక్క సన్నివేశాన్ని ఉత్కంఠ కలిగించేలా తీయలేదు.


'బ్రీత్'లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ లేకపోవడంతో అడుగడుగునా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. రైటింగ్ పరంగా సినిమాటిక్ లిబర్టీ చాలా తీసుకుని సినిమా చేశారని అనిపిస్తుంది. టెక్నికల్ పరంగానూ 'బ్రీత్'లో చెప్పుకోదగ్గ అంశాలు లేవు.


నందమూరి కథానాయకుల నటనతో పాటు డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుపెడితే... ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణతో పాటు మనవలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు డైలాగులు చెప్పే విషయంలో సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. స్పష్టంగా డైలాగ్స్ చెబుతారు. 'బ్రీత్'కు బిగ్గెస్ట్ మైనస్ నందమూరి చైతన్య కృష్ణ డైలాగ్ డెలివరీ.


చైతన్య కృష్ణ పలికిన సంభాషణల్లో స్పష్టత కొరవడింది. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాల్లో వాయిస్ ఓవర్ వినబడుతుంది. స్క్రీన్ మీద విజువల్ కనిపిస్తుంటే మళ్ళీ వివరించడం ఎందుకో అర్థం కాదు. నిజంగా వివరణ అవసరమైన చోట పాఠం అప్పజెప్పినట్లు చైతన్య కృష్ణ డైలాగులు చదువుతూ వెళ్లారు తప్ప ఎఫర్ట్స్ పెట్టినట్లు అనిపించలేదు. లేదంటే ఆయన నుంచి దర్శకుడు అటువంటి డైలాగ్ డెలివరీ కోరుకున్నారని అనుకోవాలి.


నటుడిగానూ నందమూరి చైతన్య కృష్ణ మెప్పించిన సన్నివేశాలు చాలా తక్కువ. వీలైనంత వరకు ఆయన మీద భారం వేయకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు. లాంగ్ షాట్స్, లేదంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సీన్లు తీశారు. చైతన్య కృష్ణ క్లోజప్ షాట్స్ తక్కువ తీశారు. సీఎంగా నటించిన దీపక్ కౌశిక్ బాగా చేశారు. 'వెన్నెల' కిశోర్, భద్రం వంటి కమెడియన్లు ఉన్నప్పటికీ సినిమాలో కామెడీ లేదు. అంత పేలవంగా ఆ సన్నివేశాలు రాశారు.


Also Read: శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?


మనిషి జీవించడానికి 'బ్రీత్' (శ్వాస) అవసరం. ఆక్సీజెన్ కంపల్సరీ. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ప్రతి సినిమాకు నటన / రచన / దర్శకత్వం / సంగీతం వగైరా వగైరా వంటి ఆక్సీజెన్ ఏదో ఒకటి కావాలి. 'బ్రీత్'కి అటువంటి ఆక్సీజెన్ ఏదీ అందలేదు. దాంతో బోరింగ్ మూమెంట్స్ తప్ప ప్రేక్షకులకు మరొక ఎంటర్‌టైన్‌మెంట్ అందలేదు. సినిమాలో చైతన్య కృష్ణ వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్టుగా డైలాగ్ ఎప్పుడు చెబుతారు? అని ఎదురు చూడాలి. ప్రేక్షకులకు అదొక పజిల్. ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్ మూమెంట్స్ కోసమూ అలాగే ఎదురు చూడాలి.


Also Readభీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?