Brain Health: చాలామంది నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. రోజుకు ఒకసారి బ్రష్ చేసి ఊరుకుంటారు. దంతాలు బలంగా ఉంటాయని, వాటికి ఏమీ కావని అనుకుంటారు. కానీ దంతాలు, నోటి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే ఆ ప్రభావం నేరుగా మెదుడు పైనే పడుతుంది. ఈ విషయాన్ని జపనీస్ పరిశోధకులు తమ కొత్త అధ్యయనంలో కనుగొన్నారు.
పేలవమైన నోటి పరిశుభ్రత, చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం వంటివన్నీ కూడా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే మెదడు పరిమాణాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటివి మెదడు కుచించుకోవడంతో ముడిపడి ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఇది జ్ఞాపకశక్తిని తగ్గించడంతోపాటు మతిమరుపు వ్యాధి వచ్చేలా చేస్తుంది. జపాన్లోని సెండాయ్‌లోని యూనివర్సిటీ వారు నిర్వహించారు. నాలుగేళ్లపాటూ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ నాలుగేళ్ల పాటూ దంతాల ఆరోగ్యం, మెదడు పరిమాణాన్ని అంచనా వేస్తూ వచ్చారు. ఈ అధ్యయనంలో భాగంగా 67 ఏళ్లు పైబడిన వారిని ఎంచుకున్నారు. వారికి మతిమరుపు వంటి సమస్యలు ఏవీ లేవు. వీరికి ముందుగా స్కాన్ చేసి మెదడులో హిప్పోక్యాంపస్ పరిమాణాన్ని కొలిచారు. అలాగే దంతాలు ఎన్ని ఉన్నాయి, చిగుళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అనేది కూడా అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వారిని పరిశీలించారు. చిగుళ్ల జబ్బుల బారిన పడినవారు, పళ్ళు ఊడినవారు, దంత క్షయంతో ఇబ్బంది పడుతున్న వారు... వీరందరిలో మెదడులోని హిప్పోక్యాంపస్ ఎడమ భాగం కుచించుకుపోయినట్టు గుర్తించారు. అంటే దంత ఆరోగ్యం పై మెదడు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది.
రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్నే కాదు మెదడును కూడా కాపాడుకున్న వారవుతారు. చిగుళ్ల సమస్యలు, దంత సమస్యల వల్ల మతిమరుపు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. చిగుళ్ల వాపు, నొప్పి కలవారు దాన్ని విస్మరించకుండా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడడం చాలా ముఖ్యం. కదిలే దంతాలు ఉన్నవారు వాటిని వెంటనే తొలగించుకుని కృత్రిమ దంతాలు బిగించుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మెదడును కూడా కాపాడుకున్న వారు అవుతారని చెబుతున్నారు.
Also read: పొట్ట చుట్టూ చేరిన కొవ్వు త్వరగా తగ్గాలా? ఉదయం ఈ పనులు చేయండి