పుట్టిన మరు క్షణం నుంచే వయసు పెరగడం మొదలవుతుంది. ఇక జీవితాంతం వయసు పెరుగుతూనే ఉంటుంది. ఇక వృద్ధాప్యంలో తప్పించుకోలేని నరకయాతనతో సతమతం అవుతూ ఉండాలి. ఇదంతా జీవితంలో భాగమే. అయితే, జీవితంలో ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు వెళ్తుంటాం. బాల్యం, టీనేజ్, అడల్ట్, మిడిల్ ఏజ్.. ఇలా ప్రతి ఒక్కటీ చూస్తాం. ఇక పెద్దవాళ్లం అయిన తర్వాత చాలా బాధ్యతగా మెలగడం ప్రారంభిస్తాం. శరీరకంగా కూడా ఎన్నో మార్పులు చూస్తుంటాం. అయితే, ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఇలా జరగడానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. సరిగ్గా ఒక వయస్సుకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు, శరీరంలో మార్పులు కలుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ వయస్సు ఏమిటీ? ఏయే వయస్సులో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దామా.


వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాల్లో మెరుగు పడుతుంటామని తాజా పరిశోధనలు కొన్ని శాస్త్రీయ ఆధారాలు చూపుతున్నాయి. గుడ్ న్యూస్ ఏమిటంటే మన వయసు పెరిగే కొద్దీ ఆయుష్షు తగ్గిపోతుండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో మెరుగువుతుంటామని, ఒకటి తరుగుతున్నా మరొకటి మెరుగవుతుందని అంటున్నారు నిపుణులు. యువకులుగా ఉన్నపుడు మంచి శారీరక దారుడ్యంతో శక్తివంతంగా ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ భాష మీద మంచి పట్టుతో చాలా విస్తృతమైన పద పరిజ్ఞానం కలిగి ఉంటారు.


18 ఏళ్ల వయస్సులో..


7, 8 సంవత్సరాల వయసులో రెండో భాష నేర్చుకోవడం సులభం అనే వాదనను పూర్థి స్థాయిలో సమర్థించేందుకు నిపుణులు సంశయిస్తున్నారు. మెజారిటీ నిపుణులు టీనేజికి ముందు కొత్త భాష నేర్చుకోవడం మంచిదనే వాదనను సమర్థిస్తున్నారు. మెదడు ప్రాసెస్ చేసే వేగం 18 సంవత్సరాల వయసులో గరిష్టంగా ఉంటుందట. న్యూరో సైంటిస్టులు ఒక అధ్యయనంలో దీన్ని కనుగొన్నారు. విషయాలను గుర్తుపెట్టుకోవడం, పేర్లు వంటి వాటిని త్వరగా గుర్తుచేసుకోవడం వంటి సామర్థ్యం 18 సంవత్సరాల వయసులో ఎక్కువగా ఉంటుందట. అయితే 19 ఏళ్ల వయస్సు నుంచి ఈ సామర్థ్యం తగ్గడం ప్రారంభం అవుతుందట.


28 ఏళ్ల వయస్సు నుంచి..


25 సంవత్సరాల వయసులో ఉన్నపుడు శారీరక సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. ఈత, స్ప్రింటింగ్ వంటి ఆక్సిజన్ వినియోగం ఎక్కువగా ఉండే ఆటల్లో ఈ వయసు వారు బాగా రాణించగలరు. శారీరక సామర్థ్యం 25లో గరిష్టానికి చేరి అది 28 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. 50 సంవత్సరాల పాటు మారథాన్ ఫలితాలను విశ్లేషించిన తర్వాత కేవలం రెండు గంటల్లో రేసు పూర్తిచేసే సామర్థ్యం కలిగిన వారు 28 సంవత్సరాల వయసు వారు అయ్యి ఉంటారట.


35 ఏళ్ల వరకు చెస్‌లో రాణించవచ్చు


చదరంగం కాగ్నిటివ్ ఎబిలిటిని కొలిచే ఆట. ఇందులో ప్రాసెసింగ్ స్పీడ్, ప్రణాళికా రూపకల్పన, ఫ్లూయిడ్ ఇంటలిజెన్స్, జ్ఞాపకశక్తి వంటివన్నీ ఈ ఆటకు అవసరమవుతాయి. 24 వేల మంది చెస్ ప్రొఫెషనల్స్ ను పరీక్షించిన తర్వాత వయసు 20 దశకంలో ఉన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చి 35 ఏళ్ల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుందని విశ్లేషించి చెప్పారు.


43 ఏళ్ల వయస్సులో పీక్స్


వయసు 40 ల్లో ఉన్న వారిలో ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా 43 సంవత్సరాల వయసులో ఉన్న వారికి ఏకాగ్రత గరిష్ట స్థాయిలో ఉంటుందట. సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం తగ్గినప్పటికీ ఎక్కువ సమయం పాటు దృష్టి నిలపగలరు కనుక ఈ వయసు వారికి గెలుపు అవకాశం ఎక్కువని ఈ అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.


వెకాబలరీ 65లో గరిష్టం


వయసు 65 చేరేనాటికి వెకాబలరీ అంటే భాషా సామర్థ్యం గరిష్టానికి చేరుతుందట. నానాఅర్థాలు, పర్యాయ పదాల కోసం తడుముకునే పనిలేకుండా చాలా సులభంగా చెప్పగలిగే సామర్థ్యం 65 సంవత్సరాల వయసు చేరేనాటికి వచ్చేస్తుందట.


మానసిక స్థితి 82లో సంపూర్ణం


వయసు పూర్తిగా మళ్లే నాటికి జీవితాన్ని అప్రిషియేట్ చెయ్యడం నేర్చుకుంటామట. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రచురించిన అధ్యయనం దీన్ని స్పష్టం చేసింది. మానసికంగా పూర్తి వికాసం జరిగేది 80 ఏళ్ల వయస్సులోనే అని నిపుణులు తెలిపారు.


Also read : బరువు పెరుగుతున్నారా? జాగ్రత్త, ఈ 5 రకాల క్యాన్సర్లు ప్రాణాలు తీయొచ్చు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial