Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలో భాగమయ్యారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకయ్యాయి. ఇందులో నిజానిజాలు ఎన్ని ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే.. ఒక్క సారిగా వాలంటీర్ల వ్యవహారంపై చర్చ ప్రారంభమయింది. వాలంటీ్లు ఎవరు ? వారి విధులేంటి ? ప్రజల వ్యక్తిగత డేటా వారి వద్ద ఎందుకు ఉంటోంది ? ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో వాలంటీర్లు  అనేక రకాల నేరాల్లో పాల్గొన్న ఘటనలకు సంబంధించిన వార్తలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ వాలంటీర్ల వ్యవహారాన్ని..  ప్రజల్లోకి చర్చ పెట్టాలనుకున్నారని అందుకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. పవన్ ఎందుకు వాలంటర్లను గురి పెట్టారు ?


వాలంటీర్లను పూర్తిగా పార్టీ పనులకు వాడుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ 


ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ను ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేశారు. ఒక్కో వాలంటీర్‌కు రూ. ఐదు వేలు చొప్పు నెలకు ఇస్తున్నారు.  వారిలో 90 శాతం మంది పార్టీ కార్యకర్తలేనని మొదట్లో వాలంటీర్ నియామక ప్రక్రియను  చూసుకున్న విజయసాయిరెడ్డి ప్రకటించారు. తర్వాత  వివిధ సందర్భాల్లో  వాలంటీర్లు అంతా మన వాళ్లేనని ఎవరైనా తోక జాడిస్తే  తీసేయాలని మంత్రులు చేసిన ప్రకటలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాలంటీర్లు ప్రతీ సందర్భంలోనూ వైఎస్ఆర్‌సీపీకి ప్రచారకర్తలుగా ఉన్నారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎన్నికలు వచ్చిప్పుడు లేదా సీఎం బహింగసభ పెట్టినప్పుడు ఓటర్లను.. ప్రజలను సమీకరించడం కూడా వాలంటీర్లు చేస్తున్నారు. మ పరిధిలో ఎరెవరు .. వైఎస్ఆర్‌సీపీ ఓటర్లు కాదో మ్యాపింగ్ చేస్తున్నారని.. కూడా అంటున్నారు. ప్రజాధనంతో గౌరవ వేతనం పొందుతున్న వాలంటీర్లు ఇలా పార్టీ సేవలో ఉండటాన్ని  పవన్ కల్యాణ్ మరింత  బలంగాప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. 


ప్రజల వ్యక్తిగత డేటా వాలంటీర్ల చేతుల్లో ! 


పవన్ కల్యాణ్ తన ఆరోపణల ద్వారా ప్రధానంగా  ప్రజలకు చెప్పాలనుకున్న విషయం.. ప్రజల వ్యక్తిగత డేటా .. వాలంటీర్ల చేతుల్లో ఉండటం. యాభై ఇళ్లకు సంబంధించిన జనాభా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు  ప్రభుత్వం వాలంటీర్లకు యాక్సెస్ ఇస్తుంది. వాలంటీర్ అనే వ్యక్తికి ఎలాంటి బాధ్యతా లేదు. అంతకు మించి అధికారం లేదు. అది ఏ మాత్రం చట్టబద్దత లేని వ్యవస్థ. వారు ఉద్యోగులు కాదని ప్రభుత్వమే నేరుగా చెబుతోంది. వారు సేవకులని చెబుతున్నారు. మరి ప్రభుత్వం వద్దే ఉండాల్సిన రహస్య ప్రజల డేటా వారికి ఎలా ఇస్తున్నారు ? అనేదే ఇక్కడ కీలక విషయం. ఆ యాభై ఇళ్లల్లో ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే..  ఆ సమాచారాన్ని వాలంటీర్లు ఎవరికో ఇస్తున్నారని పవన్ అంటున్నారు. నిజానికి అలాంటి సమాచారం .. ఎవరికి ఇచ్చినా ఎవరూ జవాబుదారీ కాదు. కానీ ప్రజల వ్యక్తిగత డేటా మాత్రం వాలంటీర్ల చేతుల్లో ఉన్నదన్నది పచ్చి నిజం. 


ప్రభుత్వ పథకాల లబ్దిదారులపై సర్వహక్కులన్నట్లుగా  వాలంటీర్ల తీరు !


వైఎస్ఆర్‌సీపీ సభకు లేదా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే సభలకు తమ పరిధిలో లబ్దిదారులు రాకపోతే.. వారి పథకాలను కట్ చేసే అధికారం వాలంటీర్ కు ఉంది. అలాగే.. పథకాలకు లబ్దిదారుల్ని సిఫారసు కూడా చేయవచ్చు. ఇదే వాలంటీర్ అంటే  పథకాల లబ్దిదారులకు గౌరవం ఇచ్చేలా చేస్తోంది. నిజానికి వాలంటీర్ కు ఇలాంటి వాటిపై ఎలాంటి హక్కూ ఉండదు. ప్రభుత్వ పరంగా లబ్దిదారుల్ని తొలగించాలన్నా.. కొత్తగా ఇవ్వాలన్నా అనేక విధి విధానాలు ఉంటాయి. వాటిని పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అల్టిమేట్ వాలంటీర్ కావడం వల్ల సమస్య వస్తోంది. వారికేం సంబంధం అనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పథకాల లబ్దిదారుల దగ్గర వాలంటీర్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 


వాలంటీర్లపై ప్రజా వ్యతిరేకత పెరిగితే వైఎస్ఆర్‌సీపీకి నష్టం 


నిజానికి వాలంటీర్ల విషయంపై ఎమ్మెల్యేలోనూ అసంతృప్తి ఉంది. గతంలో ఎలాంటి పని  కావాలన్నా ప్రజలు ఎమ్మెల్యే ద్గగరకు  వచ్చేవారు.ఇప్పుడు వాలంటీర్ ద్వారా.. చక్క బెట్టుకుంటున్నారు. నేరుాగ సీఎం జగన్ మనుషులుగా వారు ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు కూడా తమకు వాలంటీర్లకు ఉన్నంత వాల్యూ లేదని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా సీఎం జగన్ రాజకీయ కోణంలోనే ఏర్పాటు చేశారన్నది ఎక్కువ మంది నమ్మే  మాట. అందుకే పవన్.. ఆ వ్యవస్థలోని లోపాలను వ్యూహాత్మకంగా బయటపెట్టి.. ప్రజల్లో చర్చకు పెట్టారని అంటున్నారు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవహారంపై ప్రజల్లో కొంత అనుమానాలున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ హెచ్చరికలతో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అది వాలంటీర్లపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేస్తే.. వైఎస్ఆర్‌సీపీకి తీవ్ర నష్టం జరుగుతుంది.