అధ్యక్షుడి మార్పుతో తెలంగాణ బీజేపీలో ఏర్పడిన గ్యాప్స్‌ను పూడ్చే పనిలో అధినాయకత్వం ఉంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై సీరియస్‌గా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


తెలంగాణలో ఆదివారం పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్నారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం అనంతరం తెలంగాణ నేతలతో మాట్లాడారు. కిషన్‌ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన ఈ తొలి భేటీ చాలా హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు బీఎల్‌ సంతోష్‌, ప్రకాష్‌ జవదేకర్‌, సునీల్ బన్సల్‌, తరుణ్‌చుగ్‌, ఈటలరాజేందర్, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, వివేక్‌, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. 


ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీలో తలెత్తిన పరిణామాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. కొందరు నాయకులు నేరుగా అధినాయకత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా వచ్చే ఎన్నికలు పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అంతా రెడీగా ఉండాలన్నారు. అదే లక్ష్యంతో పని చేయాలి కానీ విభేదాలతో పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని హితవుపలికారు. ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని నేతలకు నడ్డా ఆదేశించారు. వాటితో నిత్యం ప్రజల్లో ఉంటూ కేంద్రం చేపట్టిన పథకాలు వివరిస్తూనే ప్రజాసమస్యపై పోరాడాలని సూచించారు. 


మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే పని కూడా నేతలు ప్రారంభించారు. ఈ పనిని సీనియర్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌గా ఉన్న ఈటల అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నీ సర్దుకుంటాయని ఆయన పార్టీ మాటగా చెబుతున్నారు. 






బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొందరు, పార్టీ అధ్యక్షుడు మారిన తర్వాత మరికొందరు, బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పదం ఉందని ఇంకొందరు ఇలా చాలా మంది నేతలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వీళ్లందరినీ కలిసి మాట్లాడాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొందరితో ఫోన్‌లో మాట్లాడారు. మరికొందరిని నేరుగా కలిశారు. దాదాపు అందర్నీ కలిసి పార్టీ మార్పుపై ఎలాంటీ నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు. చెప్పబోతున్నారు. 


ఈటల రాజేందర్‌ పనిలో పనిగా తనకు వ్యతిరేకంగా పని చేసే వారిని కూడా కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారట. అందుకే వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికే తన ఈ మధ్య మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. చాలా సమయం ఇద్దరూ చర్చలు జరిపారు. ఆదివారం చంద్రశేఖర్, గరికపాటి మోహన్‌రావును ఈటల కలిశారు.