హిళల్లో ఎక్కువగా కనిపించే రుగ్మత థైరాయిడ్. ఈగ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరమంతా పడుతుంది. రోజువారీ జీవనానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేయడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ఎక్కువగా హార్మోన్లు విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అదే తక్కువ హార్మోన్లు విడుదల అయితే అది హైపో థైరాయిడిజం అని పిలుస్తారు. చలికాలంలో హైపో థైరాయిడిజం లక్షణాలు తీవ్రంగా బాధిస్తాయి. బరువు పెరగడం, అలసట, విపరీతమైన చలిగా అనిపించడం, డిప్రెషన్, మలబద్ధకం, చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. చల్లని వాతావరణం కారణంగా థైరాయిడ్ సరిగా పనిచేయడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


హైపో థైరాయిడిజం అంటే ఏంటి?


మయో క్లినిక్ ప్రకారం థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లని విడుదల చేయకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. ఇది శరీర పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించకపోతే కాలక్రమేణా చికిత్స చేయడానికి వీల్లేని పరిస్థితికి దారి తీస్తుంది. ఊబకాయం, వంధ్యత్వం, ఆర్థరైటిస్, గుండె సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.


హైపో థైరాయిడిజం లక్షణాలు


ఈ వ్యాధి లక్షణాలు దాని తీవ్రతని బట్టి వేర్వేరు వ్యక్తుల్లో మారుతూ ఉంటాయి. అయితే సాధారణంగా కనిపించే సంకేతాలు ఇవి.


☀ తీవ్రమైన అలసట


☀ విపరీతమైన చలి


☀ దీర్ఘకాలిక మలబద్ధకం


☀ చర్మం పొడిబారటం


☀ బరువు పెరగడం


☀ కండరాల్లో బలహీనత, నొప్పి


☀ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం


☀ పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం


☀ జుట్టు రాలడం, సన్నబడటం


☀ డిప్రెషన్


☀ జ్ఞాపకశక్తి మందగించడం


☀ గొంతు బొంగురుపోవడం


☀ లైంగిక ఆసక్తి తగ్గిపోవడం


చలికాలంలో హైపో థైరాయిడిజం అదుపులో ఉంచుకోవడం ఎలా?


చల్లని వాతావరణం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ హైపో థైరాయిడిజం సమస్య వల్ల ఆ పరిస్థితి ఉండకపోగా ఇతర సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


ఎండలో కూర్చోవాలి


శరీరంలోని హార్మోన్లని ప్రభావితం చేసే ఉత్తమ మార్గాలలో ఒకటి సూర్యరశ్మి తగలడం. శరీరానికి ఎండ తగలడం వల్ల అలసట, నిరాశ దూరం చేసుకోవచ్చు. ఈ రెండు హైపో థైరాయిడిజం మీద ప్రభావం చూపిస్తాయి. సూర్యరశ్మి తగలడం వల్ల శరీరానికి సహజమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. థైరాయిడ్ పనితీరుకి ఇది కీలకం.


వ్యాయామం


ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల శరీరం చురుకుగా ఉండదు. అందుకే యాక్టివ్ గా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. నడక, ఏరోబిక్స్, యోగా, జుంబా వంటివి చేయడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


స్వీట్లు తినడం మానేయాలి


చలికాలం చాక్లెట్లు, కేకులు, రుచికరమైన డెజర్ట్ లు తినడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన చక్కెర హైపో థైరాయిడిజం సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే స్వీట్లు తీసుకోవడం పూర్తిగా మానేయడం మంచిది.


సరిపడినంత నిద్ర అవసరం


దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం సమస్యని తీసుకొస్తుంది. అందుకే 7-8 గంటల పాటు నిద్ర తప్పకుండా అవసరం.


ఒత్తిడి తగ్గించుకోవాలి


ఒత్తిడి అనేక అనారోగ్యాలకి ప్రధాన కారణం. థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చల్లని vs వేడి నీళ్ళు - ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?