క బిడ్డని కనగానే చాలు అని చాలా మంది భార్యభర్తలు అనుకుంటారు. ఉద్యోగాలు, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఇలా ఆలోచిస్తుంటారు. అయితే, ఇంట్లోవాళ్లు మాత్రం రెండో సంతానం ఎప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.  ఒక్కోసారి అయితే అమ్మాయిలకి అత్తమామల దగ్గర నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. రెండో సంతానం లేకపోతే ఎలా? వెంటనే దానికి ప్లాన్ చేసుకోండని అంటుంటారు. రెండో సంతానం కనాలా, వద్దా అనేది భార్యాభర్తల ఇష్టం. కానీ రెండో సంతానం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనేది కొందరి వాదన. అవేంటో ఒకసారి చూద్దాం.


తోబుట్టువులు ఒకరికొకరు అండగా ఉంటారు


ఎవరూ లేనప్పుడు తోబుట్టువులే అండగా ఉంటారు. ఒక్కళ్ళే ఉండటం వల్ల వారికి తోడు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆడుకునేందుకు కానీ, అల్లరి చేసేందుకు కానీ, ఇంట్లో ఒక్కరే అయిపోతారు. అదే మరొక బిడ్డ ఉంటే వాళ్ళు ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉంటారు. ఒకరి కష్టాలని మరొకరు పంచుకుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి పెరుగుతారు. వయస్సు పెరిగే కొద్ది తమకంటూ ఒకరు అండగా ఉంటారనే భావన వారి మనసులో బలంగా నాటుకుపోతుంది. వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది.


రెండో సారి గర్భం గురించి అవగాహన ఉంటుంది


ఒకసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఏది మంచి, చెడు అనే విషయం గురించి తెలుసుకుంటారు. రెండో సారి గర్భం దాల్చిన సమయంలో వాటిని అధిగమించే అవగాహన వస్తుంది. సవాళ్ళని సులభంగా ఎదుర్కోగలుగుతారు. మొదటిసారి ప్రసవ సమయం చాలా ఎక్కువగా జరిగిందనే భావన వస్తుంది. కానీ రెండో సారి గర్భం దాల్చినప్పుడు చాలా తక్కువ సమయంలోనే ప్రసవం అవుతుందనే భావన కలుగుతుంది. 


తోబుట్టువులకి అదనపు సంరక్షణ


కొన్ని సార్లు పిల్లల సమస్యలని పరిష్కరించడానికి తల్లిదండ్రులు కుదరదు. అదే వారికి తోబుట్టువు ఒకరు ఉంటే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు అర్థం అయ్యేలాగా చెప్పగలరు. వాళ్ళకి ఒక సంరక్షకులుగా నిలుస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా తల్లిదండ్రులతో చెప్పలేనిది తోబుట్టువులతో చెప్పుకోగలుగుతారు. చిన్న వారికి సహాయం చెయ్యడానికి పెద్ద వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు. అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రులు లేని లోటుని తోటి వాళ్ళు తీర్చగలుగుతారు.


భయమనేదే ఉండదు


ఒక్కళ్ళే పడుకోవాలంటే భయంగా అనిపిస్తుంది. అదే తోడుగా ఇంకొకరు ఉంటే వారికి అదనపు ధైర్యం వస్తుంది. అర్థరాత్రి బెడ్ మీద ఒక్కరే ఉండరు. ఒకరితో మరొకరు ఆడుకోవచ్చు. ఒకరి అనుభవాలు మరొకరితో షేర్ చేసుకోవచ్చు. తెలియని విషయాలని తోబుట్టువుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉండటం వల్ల బలంగా ఉంటారు.


సమస్యలు పరిష్కరించుకోగలరు


ఒంటరి బిడ్డ మీద తల్లిదండ్రులు అమితమైన ప్రేమ చూపిస్తారు. గారాబం చేస్తారు. ఒక్కోసారి అది ప్రమాదకరం కావొచ్చు. పెరిగే కొద్ది వారిలో ఆలోచనలు వేరుగా ఉంటాయి. కుటుంబంలోని ఇంకొకరిని దగ్గరకి తీసినప్పుడు వారిలో స్వార్థం వస్తుంది. అదే తమకంటూ సొంత వ్యక్తి తోడుగా ఉంటే ఇద్దరు చక్కగా మాట్లాడుకోని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వారి భవిష్యత్ కి ఇదొక మంచి కమ్యూనికేషన్ గా నిలుస్తుంది. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ఈ ఆహార పదార్థాలు పొట్టలో సీక్రెట్‌గా ఎసిడిటీ పెంచేస్తాయ్