Sajjala ON BRS :  ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ పోటీ చేయడం మంచిదేనని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. విభజన తర్వాత తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలనుకున్నామని అందుకే తెలంగాణలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. భారత రాష్ట్ర సమితికి మద్దతు కావాలని కేసీఆర్ .. సీఎం జగన్ ను అడిగితే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కానీ తాము ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల్ తెలిపారు. 


ఏపీ తప్ప ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసేది లేదని సజ్జల క్లారిటీ 


మరో వైపు కర్ణాటకలో కూడా వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయబోతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ ఊహాగానాలేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము కర్ణాటకలో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే తమిళనాడులోనూ పోటీ చేయవచ్చన్నారు. అసలు తెలంగాణనే వద్దనుకుని ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు  పోటీ చేస్తామని ప్రశ్నించారు. 


కేసీఆర్ మద్దతు అడిగితే పార్టీలో చర్చించి నిర్ణయం 


తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే తెలంగాణలో రాజకీయ పోరాటం చేస్తున్న జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కనీసం సంఘిభావం  చెప్పడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిలపై నర్సంపేటలో రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత ఆమెను రెండు సార్లు అరెస్ట్ చేశారు. ఓ సారి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి ఎలాంటి సానుభూతి కానీ మద్దతు కానీ లభించలేదు. స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించలేదు. వైఎస్ షర్మిలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రోజున.. అక్కడి రాజకీయాలతో తమకు ఏం సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు.


కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు


ఇక జాతీయ రాజకీయాల్లో రాణించడానికి బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో కలిసి పని చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేకహోదాకు కేసీఆర్ మద్దతు పలికారు. గత ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణకు చెందిన 42 మంది ఎంపీలు కలసి కట్టుగా పని చేస్తే.. కేంద్రం మెడలు వంచవచ్చని.. ఏపీ ప్రత్యేకహోదాకు తాము మద్దతునిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ అంశంపై రెండు పార్టీల ఎంపీలు పెద్దగా స్పందించలేదు. కేంద్రానికి ఎవరి మద్దతూ అవసరం లేకపోవడమే దీనికి కారణం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కలసి కట్టుగా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న ఆలోచన.. రెండు పార్టీల నేతల్లో ఉందని ఢిల్లీ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో... పొత్తుల మాటే ఉండదని సజ్జల చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.