ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేయటంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైల్వేశాఖ చుక్కలు చూపిస్తున్నాయి. రాబోయే రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్‌ జాబితానే కనిపిస్తోంది. కరోనా కారణంతో గడిచిన రెండు సంవత్సరాలపాటు దర్శనాలు చేసుకునే వీలు లేక చాలా మంది భక్తులు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ ఎడాది తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో ఇరుముడిని నెత్తిన పెట్టుకున్న అయ్యప్ప భక్తులు  రైలు ప్రయాణం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రతి రైలులో కూడా వెయిటింల్ లిస్ట్ ఉండటంతో భక్తులకు తీవ్ర అసౌకర్యంగా మారింది.


డిమాండ్‌కు తగ్గట్టుగా లేని రైళ్ళు 
భక్తుల డిమాండ్‌ మేరకు రైళ్లు లేవన్న విషయాన్ని రైల్వే అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక  రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు ఫుల్ అయిపోయాయి. ఇక వెయిటింగ్‌ లిస్టులో అంకెలు అయితే వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్‌ కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉందన్న విషయం అధికారులు ముందుగానే గుర్తించారు. కానీ దక్షిణ మధ్య రైల్వే  ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులకు సరిపోవటం లేదు.


ప్రతిసారి ఆలస్యమే 


అయ్యప్ప భక్తులు ప్రతి ఏటా శబరిమల వెళ్ళటం పరిపాటి. లెక్కలు కాస్త ఎక్కువ తక్కువ అయినప్పటికి భక్తులు మాత్రం భారీగా రైలు ప్రయాణంపైనే ఆదారపడుతుంటారు. ప్రతి ఏటా ఆలస్యంగా రైల్వే అధికారులు స్పందించటం సర్వసాదారణంగా మారిపోతోంది. మకరజ్యోతి దర్శనం దగ్గరపడుతుండగా అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను మొక్కుబడిగా ప్రకటిస్తుంటారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్ళలోకనీస సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఆలస్యం మాట కొస్తే ఉదయం వెళ్లాల్సిన రైలు సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైలు అర్ధరాత్రి సమయంలో ప్లాట్ ఫారం నుంచి కదులుతుంటాయి. ప్రత్యేక రైలు అంటే ఇదే స్పెషల్ అంటూ రైల్వే అధికారులే చాలా సార్లు జోకులుపేల్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.


కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు తిప్పలే 


కార్తీక మాసం మొదలైంది అంటే చాలు. ఇక ప్రయాణాలకు డిమాండ్ మొదలవుతుంది. శబరిమల వెళ్లే భక్తులు, విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వచ్చే భవానీ భక్తులతో రైళ్ళు రష్‌గా ఉంటాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా ఎక్కడెక్క ఉన్న తెలుగువారంతా ఏపీ వైపే ఎక్కువగా వస్తుంటారు. లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌ నుంచి బయలుదేరతారు. వీరిలో 70శాతం మంది ప్రయాణీకులు ఎక్కువగా రైలు ప్రయాణం పైనే ఆధారపడుతుంటారు. రైళ్లలో అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైలు, బస్సులను ఏర్పాటు చేయలేక అధికారులు చేతులు ఎత్తేయటం ప్రతి ఏటా కామన్ అయిపోయింది.


అందుకే ఈసారి ప్రయాణికల్లో అసహనం కట్టలు తెంచుకుంది. మాల వేసిన స్వాములే రైల్వే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి విమానాల్లో వెళ్లలేక... రైలు ప్రయాణాలపై ఆధార పడుతున్నామని... ఇక్కడ కూడా  రైళ్లు నడపడం లేదని మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రద్దీ దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.