ఉత్తర తమిళనాడు మీదుగా ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం మరింత బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీని కారణంగా తమిళనాడుతోపాటు దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. మాండౌస్ తుపాను బలహీన పడి కర్ణాటక మంగళూరు ప్రాంతం దగ్గరగా అల్పపీడనంగా కొనసాగుతోంది. 


అల్పపీడనం కారణంగా ఫుల్‌గా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమతోపాటు నెల్లూరుసహా కోస్తా ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి. రెండు రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతోంది వాతావరణ శాఖ. 


వివిధ ప్రాంతాల్లోకురిసిన వర్షపాతాలు ఇలా ఉన్నాయి. 
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా)-13, మార్కాపూర్ (ప్రకాశం జిల్లా) 10, అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా) 10, వెలిగండ్ల (ప్రకాశం జిల్లా) 9, కందుకూరు (ప్రకాశం జిల్లా) 9, మర్రిపూడి (ప్రకాశం జిల్లా) 8, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 8, ఉదయగిరి (నెల్లూరు జిల్లా) 8, పొదిలి (ప్రకాశం జిల్లా) 7, అవనిగడ్డ (కృష్ణా జిల్లా) 7, కొనకనమిట్ల (ప్రకాశం జిల్లా) 7; తంబళ్లపల్లె (చిత్తూరు) 7, వెంకటగిరి కోట (చిత్తూరు జిల్లా) 7, పెనగలూరు (వైఎస్ఆర్ జిల్లా) 7, ఆరోగ్యవరం (చిత్తూరు జిల్లా) 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 


మాండౌస్‌ తుపాను అరేబియాలోకి వెళ్లి అల్పపీడనంగా కొనసాగుతున్నందున... బంగాళాఖాతంలో ఉన్న తేమ గాలులను లాక్కుంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. 



వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు 
ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చు. 
కృష్ణా, గుంటూరు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ వెదర్‌ మ్యాన్ చెప్పారు. విశాఖలో తుంపరులు పడొచ్చు. 


కేరళకు ఆనుకొని ఈ అల్పపీడనం ఒకట్రెండు రోజుల్లో ఏర్పడ వచ్చని చెబుతోంది. దీని ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. 


తెలంగాణలో వాతావరణం 
మాండౌస్‌ ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. దక్షిణ తెలంగాణలో ఇప్పటికే జోరు వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అంచనా. ఉత్తర తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మిగతా జిల్లాల్లో చలి తీవ్ర పెరగొచ్చు. 


13వ తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. 14వ తేదీ నాటికి పూర్తిగా వర్షాలు తగ్గుముఖ పట్టనున్నాయి. అయితే బంగాళాఖాతంలో త్వరలోనే మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఎలా ప్రయాణిస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇది శ్రీలంక మీదుగా వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని కొన్ని రాడార్స్ చెబుతుంటే.. లేదు కేరళపై ఎఫెక్ట్ ఉంటుందని మరికొన్ని చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఏపీ వెదర్‌మ్యాన్ చెబుతున్నారు.