చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు తగినంత నీరు తాగాలి. దానితో పాటు మరికొందరు క్రీములు రాస్తారు. అలాగే జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సీజన్ లో జుట్టు పొడిగా, పెళుసుగా మారిపోయి విరిగిపోయే ప్రమాదం ఉంది. చుండ్రు సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. చలికాలంలో జుట్టు సమస్యల నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..


ఈ సీజన్ లో అందరూ వేడి నీటితోనే స్నానాలు చేస్తారు. దాని వల్ల చలిగాను అనిపించదు. అలాగే విశ్రాంతిగా అనిపిస్తుంది. అయితే వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల మాత్రం జుట్టుకి నష్టమని అంటున్నారు బ్యూటీషియన్స్. వేడి నీటిని నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. తలపై దురద, చుండ్రు పెరగడానికి దారి తీస్తుంది. అది సులభంగా తగ్గదు.


వేడి నీళ్ళతో తలస్నానం వల్ల నష్టాలు


వేడి నీళ్ళు హైడ్రోజన్‌ని విచ్చిన్నం చేసి జుట్టు ఉబ్బేలా చేస్తుంది. స్కాల్ఫ్‌ని మరింత పొడిగా మారుస్తుంది. జుట్టు మూలాలని బలహీనపరుస్తుంది. జుట్టు చిట్లడం వంటి సమస్య ఎదురవుతుంది. అందుకే చాలా మంది చలికాలంలో జుట్టు ఎక్కువ ఊడిపోతుందని అంటుంటారు. దీనికి వేడి నీటితో తలస్నానం చేయడం కూడా ఒక కారణం. వేడి నీళ్ళు జుట్టుని పోరస్ గా మార్చి తెగిపోయేలా చేస్తుంది. స్కాల్ఫ్ నుంచి వచ్చే సహజ నూనెని తగ్గిస్తుంది. వేడి నీటి తలస్నానం చేయడం ప్రమాదకరం అని కొంతమంది చల్లని నీరు ప్రత్యామ్నాయంగా భావిస్తారు.


చల్లని నీరు సహజ నూనెలని సంరక్షిస్తుంది. జుట్టు సహజంగా మెరిసేలా చేస్తుంది. జుట్టు, స్కాల్ఫ్ తేమని పోకుండా కాపాడుతుంది. మృదువైన మెరిసే జుట్టు అందిస్తుంది.  కానీ చలికాలంలో చన్నీటితో తలస్నానం చేస్తే ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఇది వెంట్రుకల్ని ఫ్లాట్ గా చేస్తుంది. క్యూటికల్స్ అధిక తేమతో లాక్ అవుతాయి. అందుకే చలికాలంలో చాలా మంది జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది.


ఏ నీటితో తలస్నానం చేస్తే మంచిది?


జుట్టుని షాంపు చేయడానికి గోరు వెచ్చని నీటిని ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఈ నీళ్ళు తలపై ఉన్న మురికి, ధూళిని తొలగించడానికి సహాయపడతాయి. చల్లని నీటితో షాంపూ, కండీషనర్ శుభ్రం చేసుకోవాలి. ఇది తేమని కాపాడుతుంది. తల ఆరబెట్టుకునేందుకు వేడి గా ఉండే ఉత్పత్తులకి బదులుగా జుట్టుని టవల్ తో చుట్టి నీరు అంతా పోయే దాకా ఉంచుకోవడం మంచిది. గాలికి జుట్టు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ బాగుంటుంది.


జుట్టుకి వారానికి ఒకసారి లేదా ప్రతి 15 రోజులకి ఒకసారి అయిన హెన్నా పెట్టుకుంటే మరీ మంచిది. జువా, మాల్వా,గ్వారాణా, బాబాసు ఆయిల్, జబోరాండి, అకై వంటి మూలికలు ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ సింపుల్ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది