సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి (RB Choudary) సమర్పణలో వచ్చిన సినిమా 'చెప్పాలని ఉంది' (Cheppalani Undi 2022 Movie). ఒక మాతృభాష కథ... అనేది ఉప శీర్షిక. ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమాతో యష్ పూరి హీరోగా పరిచయమయ్యారు. ఆయనకు జంటగా స్టెఫీ పటేల్ నటించగా... '30' ఇయర్స్ పృథ్వీ, మురళీ శర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, అలీ, 'సత్యం' రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే... 


కథ (Cheppalani Undi Story) : చందు అలియాస్ చంద్ర శేఖర్ (యష్ పూరి) టీవీ ఛానల్‌లో న్యూస్ రిపోర్టర్. మాతృభాష అంటే అతనికి ఎంతో అభిమానం. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏం చేయాలని జరిగిన మీటింగ్‌లో ఎందరికో సాయం చేస్తున్న సత్యమూర్తి (మురళీ శర్మ)ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. దానికి బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్యమూర్తిని ఇంప్రెస్ చేసి ఛానల్‌కు వచ్చేలా ఒప్పిస్తాడు. ఇంటర్వ్యూకి సరిగ్గా ఒక్కరోజు ముందు చందుకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుంచి తెలుగు బదులు అతడి నోటి నుంచి వేరే భాష వస్తుంది. ఆ భాష చందు లవర్ వెన్నెల (స్టెఫీ పటేల్)కు కూడా అర్థం కాదు. ఎందుకు అలా జరిగింది? ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ నుంచి చందు బయట పడ్డాడా? లేదా? వెన్నెలతో ప్రేమకథ ఏమైంది? సత్యమూర్తిని చివరకు ఇంటర్వ్యూ చేశాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 
సినిమా ఎలా ఉందంటే? (Cheppalani Undi Review) : కాన్సెప్ట్ పరంగా చూస్తే... 'చెప్పాలని ఉంది' సినిమా చాలా బావుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా గతం మర్చిపోతారు. కానీ, ఇందులో హీరో వేరే భాష మాట్లాడటం వింతగా ఉంటుంది. ఆ సన్నివేశాలు అన్నీ నవ్విస్తాయి. హీరోగా యష్ పూరికి తొలి సినిమా అయినా సరే మంచి ఈజ్‌తో చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రజెన్స్ బావున్నాయి. దీని తర్వాత మంచి అవకాశాలు రావచ్చు. హీరోయిన్ స్టెఫీ పటేల్ అందంగా కనిపించారు. సీనియర్ ఆర్టిస్టులు అందరూ చక్కగా చేశారు. 


Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా అసలు!? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?


'చెప్పాలని ఉంది' దర్శకుడు అరుణ్ భారతి మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే... దాన్ని చెప్పే విషయంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. కొన్నిసార్లు సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగా చేశారు. వింత భాష మాట్లాడుతూ హీరో చేసే ఫైట్ అలరిస్తుంది. యాక్షన్ స్టార్ హీరోస్ రేంజ్ ఫైట్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కొత్త హీరో అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. సాంగ్స్ విజువల్స్ కూడా! వాటికి ఇంకా మంచి ట్యూన్స్ యాడ్ అయితే బావుండేది. 'పరాయి భాషను గౌరవిద్దాం... మాతృభాషను ప్రేమిద్దాం' అని సందేశం ఇచ్చిన చిత్రమిది. కామెడీ, డ్రామా, రొమాన్స్, యాక్షన్... అన్నీ ఉన్నాయి. సినిమాను కొంత ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. వీకెండ్ టైమ్ పాస్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. శుక్రవారం పదిహేనుకు పైగా సినిమాలు విడుదల కావడంతో 'చెప్పాలని ఉంది'కి బాక్సాఫీస్ పరంగా ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. హీరో, దర్శకుడికి నెక్స్ట్ ఛాన్సులు మాత్రం వస్తాయి.