కొందరికి బైక్ నడపడమంటే చాలా ఇష్టం. ఎంత దూరమైనా సరే.. బైకుపై విహరించడం అలవాటు. వేలాది కిలోమీటర్లు రోడ్ ట్రిప్ వేసేవారిని కూడా మనం చూసే ఉంటాయి. అలాగే, ఉద్యోగాలకు వెళ్లేందుకు రోజుకు పదుల కిలోమీటర్ల దూరం బైకు నడిపేవారు కూడా ఉన్నారు. జాబ్ చేసే ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక.. నగర శివార్లలో నివసించే సామాన్యులు రోజూ కొన్ని కిలోమీటర్లు బైకు మీద రాకపోకలు చేస్తుంటారు. అయితే, వీరు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే.. భవిష్యత్తులో నరకయాతన అనుభవించే అవకాశం ఉంది. 


వెన్ను నొప్పి వేధిస్తుంది


టూ వీలర్ రైడింగ్ సమయంలో ఒకే భంగిమలో చాలా సమయం పాటు స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. టూవీలర్ రైడింగ్ భంగిమ మన శరీరాలకు అంత సౌకర్యవంతమైన భంగిమ కాదు కుడా. అందువల్ల కండరాల్లో, ఎముకల్లో నొప్పి వస్తుంది. మనదేశంలో టూవీలర్ రైడర్లు చాలా మంది నడుము నొప్పి, వీపు నొప్పి, భుజం, మెడ నొప్పి తో బాధపడతున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది.


ఈ నొప్పిని ఎలా నివారించాలి?


టూవీలర్ నడిపే వారు వెన్ను నొప్పి రాకుండా ఉండేందుకు వెన్నెముక, దాని చుట్టూ ఉండే వీపు కండరాలను బలోపేతం చేసుకోవాలి. వెన్నెముకపై ఒత్తిడి తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వెన్నెముకను బలపరిచే వ్యాయామాలు చెయ్యాలి. వాహనం నడుపుతున్నపుడు శరీరం సమతులంగా ఉండేలా భంగిమను సరిచేసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండడానికి వీపు కండరాలు సహకరిస్తాయి. ఎక్కువ సమయం పాటు టూవీలర్ నడిపేవారిలో ఈ కండరాలు బలహీనంగా ఉంటే త్వరగా అలసిపోతాయి. మార్జాలాసనం, వారధి ఆసనం వంటి యోగాసనాలు వీపు కండరాలను బలోపేతం చేస్తాయి. బ్యాక్ రోటేషనల్ స్ట్రెచ్, షోల్డర్ బ్లేడ్ స్క్వీజ్ వంటి స్ట్రెచెస్ కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తాయి.


రైడింగ్ భంగిమ చాలా ముఖ్యం


డ్రైవింగ్ చాలా సమయం పాటు చేసినప్పటికీ వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే కావల్సిందల్లా బండి మీద కూర్చునే భంగిమ సరిగ్గా ఉండడం. బైక్ మీద కూర్చునే స్థానం ఫూట్ రెస్ట్ సరైన తీరులో సర్దుబాటు చేసే అవకాశం ఉంటే కచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాండిల్ బార్ ను పట్టుకోవడానికి వీపు మీద ఒత్తిడి లేకుండా ఉండాలి. అంతేకాదు బండి మీద కూర్చుని నేలను తాకేందుకు కూడా పెద్దగా శ్రమించకుండా ఉండాలి. అలా మీ ఎత్తుకు సరిపడే బైక్ నే కొనుక్కోవడం మంచిది. వీపు నిటారుగా ఉంచి బైక్ మీద కూర్చోవాలి. భుజం తుంటి ఒకే లైన్లో  నిటారుగా ఉండాలి. భుజాలు బాగా ముందుకు ఒంచకుండా కాస్త వెనక్కి చతురస్రాకారంలో ఉంచడం మంచిది.


చిన్న బ్రేక్ తీసుకోండి



  • లాంగ్ సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ జామ్ లలో దొరికిన సమయాన్ని చిన్నచిన్ని స్ట్రెచ్ లు చెయ్యడానికి ఉపయోగించుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ లో ఉంటే కాసేపు ఆగి చిన్నచిన్న స్ట్రెచ్ లు చేసుకొని కాస్త విరామం తర్వాత ప్రయాణం కొనసాగించడం మంచిది.

  • బండి మీద కూర్చుని కూడా కుడి చేత్తో హ్యాండిల్ బార్ ను పట్టుకొని ఎడమ చేతితో వెనుక సీటును చేరుకునేలా స్ట్రెచ్ చెయ్యవచ్చు, ఇలాగే రెండో వైపు కూడా చెయ్యవచ్చు.

  • మెడ మీద రెండు చేతులను వెడల్పుగా పరచినట్టు పెట్టుకొని రెండు వైపులకు ఊగవచ్చు. ఇది మెడ చేతులు స్ట్రెచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

  • అంతేకాదు బైక్ ను మంచి కండిషన్ లో ఉంచుకోవడం కూడా అవసరమే. సస్పెన్షన్లను కండిషన్లో ఉంచుకోవాలి. గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద కుదుపుల సమయంలో వెన్నెముక మీద పడే ఒత్తిడిని ఇవి కాస్త తగ్గిస్తాయి.


Also read: మాస్క్ పెట్టకపోతే మెదడు మటాష్ - ఆ ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఆ ముప్పు తప్పదా? ఏది నిజం?