నేడు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలు దేవాలయాలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోనున్నారు. అరగంటపాటు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ద్రౌపది ముర్ము రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాట్లు చేశారు. కొండపై మూడు హెలిప్యాడ్‌లను సైతం సిద్ధం చేశారు అధికారులు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


రాష్ట్రపతి రాక సందర్భంగా కొండపై భక్తుల వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించి, రాష్ట్రపతికి ఆశీర్వచనం చేస్తారు. స్వయంభూ దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో రాష్ట్రపతికి చతుర్వేద ఆశీర్వచనం చేయనున్నారు.
ఇక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర కళ్లకు కనిపించేలా దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రధానాలయ మాఢవీధులోని అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఆలయ చరిత్రను రాష్ట్రపతికి వివరించనున్నారు.


నేడు బొల్లారం రాష్ట్రపతి నివాసంలో ఎట్ హోం. 
ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్లో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి తిరిగి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా వీరనారీలను సత్కరిస్తారు. అయితే ఎట్ హోంపై ఇంకా అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. 


నేటి నుంచి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నోటిఫికేషన్స్‌ విడుదలవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల చేసింది. తాజాగా గ్రూప్‌2 భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి  ప్రారంభంకానుంది. నిజానికి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డిసెంబర్‌ 30వ తేదీ నుంచి గ్రూప్‌ 4 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.


ఇక గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అయితే.. 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖలో 2,077 , సీసీఎల్‌ఏ పరిధిలో 1,294, సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ చేయనున్నారు.