ఫ్యాటీ ఫిష్... అంటే కొవ్వు పట్టిన చేపలు. చేప కొవ్వులో దొరికే నూనెలో ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటాయి. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లో, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్ ఫ్లమ్మేషన్ (శరీరంలోని మంట) పోరాడడంలో కీలకపాత్ర పోషించే అణువులను ప్రేరేపిస్తాయి. తద్వారా వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. 


కొత్త పరిశోధన ప్రకారం సాల్మన్ వంటి చేపలలో లభించే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ప్రాణాంతకమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ మ్యాగజైన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం సాల్మన్ చేపను  తరచూ తినేవారిలో అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనంలో తేలింది. అథెరోస్క్లెరోసిస్ అనేది గుండెకు వచ్చే ఒక సమస్య. దీని వల్ల ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. సాల్మన్లోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ ఫలకాల వల్ల కలిగే మంటని చల్లార్చేందుకు,  అలా ఫలకాలు ఏర్పడకుండా ఉండేందుకు సహకరిస్తాయి. 


గుండె జబ్బులు ఉన్న వాళ్లే కాదు, లేనివాళ్లు కూడా సాల్మన్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కేవలం గుండె జబ్బులే కాదు, రుమటాయిడ్ ఆర్ధరైటిస్, మూడ్ స్వింగ్స్‌కు కూడా ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు చెక్ పెడతాయి. 


కేవలం సాల్మన్లోనే కాదు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కింది ఆహారపదార్థాలలో కూడా లభిస్తాయి. 
1. వాల్‌నట్స్
2. చియా సీడ్స్
3. సోయాబీన్స్
4. అవిసె గింజలు
5. సీవీడ్
6. కిడ్నీ బీన్స్
7. ఆలివ్ ఆయిల్
8. కనోలా ఆయిల్ 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.













ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.