ఒత్తిడితో కూడిన జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, మారిన ఆహారపు అలవాట్లు కారణం ఏదైనా కావచ్చు... మహిళల్లో చాలా మంది పీరియడ్స్ సరైన సమయానికి రాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా పీరియడ్స్ రాకపోతే అవి చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటికి మనం నిత్యం వాడే కొన్ని ఆహార పదార్ధాలు మంచి పరిష్కారం చూపిస్తాయి. పీరియడ్స్ సరిగా రాని మహిళలు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. 


1. బొప్పాయి
బొప్పాయి రుతు చక్రాలను ప్రేరేపించడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయి తింటే గర్భాశయం కుచించుకుపోవడం జరుగుతుంది. ఇది పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా బొప్పాయిలో కెరోటిన్ ఉండడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా సహాయపడుతుంది. 


2. కొత్తిమీర
ఆహారం రుచినే పెంచేందుకు కొత్తిమీరను వాడుతాం. కానీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. రుతుచక్రాలను క్రమబద్దీకరిస్తుంది. కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. దీనివల్ల నెలసరులు వస్తాయి. 


3. అల్లం - లవంగం టీ
లవంగం-అల్లం కలిపి చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఆ వేడి గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. అప్పుడు నెలసరి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా నెలసరి రాని మహిళలు అల్లం-లవంగం టీ చేసుకుని తాగడం ప్రారంభించాలి. 


4. వాము
వాము తింటే శరీరంలో వేడిని ప్రేరేపిస్తుంది. దీన్ని బెల్లంతో కలిపి తింటే మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆహారపు కలయిక నెలసరులు వచ్చేలా చేయడమే కాదు, ఆ సమయంలో వచ్చే పొట్ట నొప్పిని కూడా తగ్గిస్తుంది.  


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.












ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.