ఆహారానికి - క్యాన్సర్‌కు సంబంధం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అనారోగ్యకర ఆహారాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆహారం తినే సమయం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచడం,తగ్గించడం వంటివి చేస్తుందని కొత్త పరిశోధన తేల్చింది.బార్సిలోనా ఇన్సిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం తినే సమయం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. రాత్రి 9 గంటల తరువాత రోజూ భోజనం చేసే వారిలో అంతకన్నా ముందు తినే వారితో పోలిస్తే క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా కనుగొన్నారు. అలాగే తిన్న తరువాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి పడుకోకుండా, వెంటనే నిద్రపోయే వారిలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు పరిశోధకులు. 


సిర్కాడియన్ జీవ గడియారం
సిర్కాడియన్ జీవగడియారం నిద్రపోయే, మేల్కొనే చక్రాన్ని నియంత్రిస్తుంది. ప్రతి 24 గంటలకు ఇది పునరావృతమవుతుంది. దీన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. మీ శరీరం గడియారం సక్రమంగా పనిచేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. రాత్రి 9 దాటాక తినేవారిలో తిన్నాక రెండు గంటల తరువాత నిద్రపోని వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 25 శాతం అధికం. అంటే ఆలస్యంగా తినేవారిలో శరీరానికి నష్టం కలుగుతుందని పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే రాత్రి అవుతున్న కొద్దీ మన జీవక్రియ రేటు తగ్గుతూ ఉండాలి కానీ, వేగంగా,చురుగ్గా ఉండకూడదు. కానీ ఆలస్యంగా తినడం వల్ల రాత్రంతా జీర్ణవ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. 


నిద్ర, ఆకలి, ఒత్తిడి... అనేవి హార్మోన్లు చేత ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. ఇవి ఒకదానికొకటి అనుసంధానించిలేకపోతే సిర్కిడియన్ రిథమ్ కూడా దెబ్బతింటుంది. ఇలా దెబ్బతినడాన్ని ‘సిర్కాడియన్ అంతరాయం’ అంటారు. దీనివల్ల నిద్ర కోల్పోవడం, నిద్ర రాకపోవడం వంటివి జరుగుతాయి. 


ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 621 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడేవారిని, 1205 మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడేవారిని ఎంచుకన్నారు. వీరెవ్వరూ కూడా రాత్రి షిఫ్టులలో పనిచేయలేదు. వీరి భోజనం, నిద్ర గురించి పలు వివరాలను సేకరించారు. వీరిలో ఎవరైతే రాత్రి భోజనం చేశాక రెండు గంటల తరువాత నిద్రపోతున్నారో వారిలో ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గడాన్ని గమనించారు. కాబట్టి అందరూ రాత్రి 9 గంటల్లోపే తినేయాలి. తిన్నాక రెండు గంటల పాటూ నిద్రపోకూడదు. 


క్యాన్సర్ అంటే...
క్యాన్సర్ అంటే శరీరంలోని వివిధ భాగాలలో కణాల అసాధారణంగా పెరిగి పుండులా మారతాయి. ఇది తగ్గడం చాలా కష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం. పురుషులలో అత్యంత సాధారణమైన కొన్ని క్యాన్సర్లలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, పొట్ట, కాలేయ క్యాన్సర్లు ఉన్నాయి. అయితే స్త్రీలలో రొమ్ము, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు అధికంగా వస్తాయి. 


WHO ప్రకారం, పొగాకు వినియోగం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు చేయకపోవడం, వాయు కాలుష్యం వంటివి క్యాన్సర్ కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


Also read: బ్యాటరీ కనిపిస్తే మింగేస్తుంది, పొట్టలో 55 బ్యాటరీలు, ఇదో విచిత్ర మానసిక సమస్య


Also read: రోజుకో కప్పు కాఫీ తాగితే అకాల మరణ ప్రమాదం తగ్గుతుందా? జీవితకాలం పెరుగుతుందా?