Coffee: కాఫీ గొంతులో పడితే కానీ చాలా మంది తెలవారదు. ఇప్పుడు రోజుకో కప్పు కాఫీ తాగేవారికి శుభవార్త. మీరు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల అకాల మరణం సంభవించే అవకాశం తగ్గుతుంది. యాక్సిడెంట్లు వంటివి అడ్డుకోలేం కానీ, అనారోగ్యాల కారణంగా వచ్చే మరణాన్ని వైద్యం ద్వారా కొన్ని రోజులు లేదా నెలలు వాయిదా వేయచ్చు. అలా అనారోగ్యాల బారిన పడి అకాల మరణం పొందే అవకాశాన్ని మాత్రం కప్పు కాఫీ తగ్గిస్తుంది. అయితే అతిగా తాగితే మాత్రం ఇతర ఆరోగ్యసమస్యలు దాడి చేయవచ్చు. తాజాగా చేసిన అధ్యయనంలో కాఫీకి సంబంధించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఏమిటీ అధ్యయనం...
కాఫీ అతిగా తాగితే ఎన్నో అనర్ధాలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. అసిడిటీ కూడా వస్తుంది. కానీ మితంగా తాగితే మరిన్ని ఎక్కువ రోజులు బతకవచ్చు. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం రోజుకు ఒక కప్పు నుంచి రెండు కప్పుల వరకు కాఫీ తాగేవారిలో అకాల మరణం సంభవించే అవకాశం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వారిలో జీవితకాలం పెరిగినట్టు కనుగొన్నారు. చైనాలోని గ్వాంగ్ జౌ సదరన్ మెడికల్ యూనివర్సిటీకి చేసిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. బ్రిటన్లో ఉన్న పెద్ద వయసు వారి డేటాను సేకరించి, దాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపు 171,000 కన్నా ఎక్కువ మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఏడేళ్ల పాటూ వారి కాఫీ వినియోగాన్ని పరిశీలించారు. కాఫీ తాగని వారితో పోలిస్తే... తాగే వారు అకాల మరణం బారిన పడే అవకాశం 16 నుంచి 21 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాస్త చక్కెర కలుపుకుని తాగే పెద్దవారిలో అకాల మరణం 29 నుంచి 31 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కాఫీలో కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే వారిలో మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయారు.
అతిగా వద్దు
కాఫీ మంచిదే అని అధ్యయనాలు చెప్పాయి కాబట్టి రోజూ అయిదారు కప్పులు లాగించేద్దాం అనుకుంటే పొరపాటే. అప్పుడు ఒంట్లో కెఫీన్ అధికంగా చేరి కొత్త ఆరోగ్య సమ్యలు పుట్టుకొస్తాయి. రోజుకి గరిష్టంగా రెండు కప్పులతో సరిపెట్టుకుంటే చాలు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. అతిగా తాగితే కేలరీలు కూడా అధికంగా చేరుతాయి. కాబట్టి తాగే కప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే సాయంత్రం నాలుగు దాటాక కాఫీ తాగక పోవడం చాలా ఉత్తమం. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా మార్చి నిద్ర రాకుండా చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య ఉన్న వారు కూడా కాఫీని రోజులో ఒక కప్పుకే పరిమితం చేయాలి. లేకుంటే సమస్య పెరిగిపోతుంది.
Also read: చెట్టు పాలతో తయారయ్యే పచ్చ కర్పూరం, ఇక హారతి కర్పూరం కథ మాత్రం వేరు
Also read: మహారాష్ట్రలో ఆ బేబీ పౌడర్‌పై నిషేధం, ఈ రసాయనాలు ఉంటే చంటి పిల్లలకు వాడకూడదు