కర్పూరంతో హారతి ఇవ్వనిదే ఏ పూజ పూర్తి కాదు. ఇక లడ్డూలకు మంచి సువాసన రావాలంటే పచ్చ కర్పూరం కాస్త కలపాల్సిందే. వీటిని నిత్య జీవితంలో వాడే మనం అవి వేటి నుంచి తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించామా? కర్పూరాన్ని కాంఫర్ లారెల్ అనే చెట్ల నుంచి తయారుచేస్తారు. ఈ చెట్లు ఎక్కడపడితే అక్కడ కనిపించవు. ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో ఉంటాయి. ముఖ్యంగా బోర్నియో, తైవాన్ దేశాల్లో కనిపిస్తాయి. మనదేశంలో నీలగిరి కొండల్లో, మైసూర్, మలబార్ ప్రాంతాల్లో ఈ చెట్లు అధికంగా ఉన్నాయి.  ఈ చెట్ల ఆకులు కొమ్మల నుంచి పాలను తీస్తారు. చెట్టకు గాటు పెడితే పాలు కారుతాయి. ఆ పాలతోనే కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర తులసి అనే మొక్కల నుంచి కూడా వీటిని తయారుచేస్తారు. 


పదిహేను రకాలు...
మనకు తెలిసిన కర్పూరాలు రెండే. ఒకటి పచ్చ కర్పూరం, రెండోది హారతి కర్పూరం. కానీ వీటిలో పదిహేను రకాలు ఉన్నాయి. అవి ఘన సారం, భీమసేనం, ఈశావాసం, ఉదయ భాస్కరం,కమ్మ కర్పూరం,ఘటికం,తురు దాహం, తుషారం, హిమ రసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతాశం, సితా భ్రం. కాకపోతే మనకి పచ్చ కర్పూరం, హారతి కర్పూరాలతోనే ఎక్కువ పని. అందుకే మిగతా వాటి గురించి మనకు తెలియదు. 


పచ్చ కర్పూరం...
చెట్లు వేర్లు, కాండం, కొమ్మలను నీళ్లలో మరిగించి పాలను బయటికి తీస్తారు. డిస్టిలేషన్ పద్ధతిలో పచ్చ కర్పూరాన్ని తయారుచేస్తారు. ఆహారతయారీకి దీన్ని ఎక్కువగా వాడతారు. అలాగే ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. కాటుక తయారీలో కూడా వాడతారు. 


హారతి కర్పూరం
మన అందరిలో ఇళ్లలో ఇలా నిప్పు అంటగానే మండిపోయే కర్పూరం ఇది. దీన్ని తయారు చేయడానికి రసాయనిక ప్రక్రియను వాడతారు. టర్పెంటైన్‌ను కలిపి రసాయనిక పద్ధతిలో హారతి కర్పూరాన్ని తయారుచేస్తారు. దీన్ని ఆహారంలో కానీ, ఔషధాలలో కానీ వాడరు. 


ఆరోగ్యానికి...
పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. అది అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. దగ్గు, జలుబు చేసినప్పుడు పచ్చకర్పూరం వేసి ఆవిరి పడితే చాలా మంచిది. ఆ వాసన పీల్చిన కూడా మేలు జరుగుతుంది. నిద్రపోయే ముందు పచ్చకర్పూరం పొడిని ఛాతీపై రుద్ధితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.నిద్రపోయే ముందు కర్పూరం కలిపిన నూనెను తలకు పట్టిస్తే హాయిగా నిద్రపడుతుంది. ప్రశాంతమైన భావనను కలిగిస్తుంది. అంతేకాదు కర్పూరం కలిపిన నూనెను జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకల పెరుగుదల కూడా బావుంటుంది. వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. జుట్టును మృదువుగా పెరిగేలా చేస్తుంది. 


హారతి కర్పూరాన్ని మాత్రం ఆహారంలో వాడకూడదు. అలాగే జుట్టుకు రాసే నూనెలు వంటి వాటిలో కలపకూడదు. కేవలం పచ్చకర్పూరాన్ని మాత్రమే ఇందుకు వాడాలి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు హారతి కర్పూరంలో టర్పెంటైన్ అనే రసాయనం ఉంటుంది. 


Also read: మహారాష్ట్రలో ఆ బేబీ పౌడర్‌పై నిషేధం, ఈ రసాయనాలు ఉంటే చంటి పిల్లలకు వాడకూడదు


Also read: వాడిన వంటనూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ ప్రాణాంతక సమస్యలు ఎప్పుడైనా రావచ్చు