అన్ని కాలాలలో కొత్తిమీర అందుబాటులో ఉంటుంది. ప్రతికూరలోనూ కొత్తిమీరను కలుపుకోవచ్చు. దేనికి జతచేసినా రుచి పెరుగుతుందే కానీ పెరగదు. అదే కొత్తిమీర విశిష్టత. కొత్తిమీర ఆకులు, ఎండిన గింజలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. తాజాగా దొరికే కొత్తిమీరను పచ్చడి చేసుకున్నా, కూరలపై చల్లుకున్నా, బిర్యానిలో వేసుకున్నా రుచి అదిరిపోతుంది. రుచి కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా కొత్తిమీరను ప్రతిరోజూ తినాలి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు కొత్తిమీరను, ధనియాలను రోజూ తినాల్సిన అవసరం ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకొని డయాబెటిస్ రోగాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకునే సామర్థ్యం వీటికి ఎక్కువ.
అమెరికాలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం డయాబెటిస్ ఉన్న ఎలుకలపై ధనియాలతో ఒక ప్రయోగం చేశారు. ధనియాలలో ఉన్న విత్తనాలు రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడింది. దీనివల్ల ఇన్సులిన్ విడుదల పెరిగింది. ఆ ఎలుకలు సాధారణంగా జీవించడం మొదలుపెట్టాయి. వాటి ఆరోగ్యం కూడా మెరుగయింది. దీన్నిబట్టి కొత్తిమీర, ధనియాలు రెండిటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని తేలింది. సాధారణంగా కూడా కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం, విటమిన్ కే వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకుంటుంది. కిడ్నీలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీలోని వ్యర్ధపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు కొత్తిమీరను తరచూ తినాలి. అలాగే గుండె సమస్యలతో బాధపడేవారు కూడా కొత్తిమీరని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ కెరటం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. కొత్తిమీర తినడం వల్ల చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పి కూడా తగ్గుతుంది. నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. కొత్తిమీర ఆకులను పచ్చివి నమిలితే నోటికి ఎంతో మంచిది. కొత్తిమీరలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కంటి అలెర్జీలు కూడా కొత్తిమీర వల్ల తగ్గుతాయి. దీనిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ కొత్తిమీర తింటే ఆరోగ్యానికి లాభమే తప్ప, ఎలాంటి నష్టం ఉండదు. కేవలం డయాబెటిస్ ఉన్న వాళ్లే కాదు, లేని వాళ్లు కూడా కొత్తిమీర రోజూ తినాలి.
Also read: రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నారా? మద్యం తాగినంత ప్రమాదం
Also read: అక్షరాలు దిద్దించిన మీ తొలి గురువును ఓసారి తలుచుకోండి, వారే మీ ఉన్నతికి పునాది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.