విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖుషి’. మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. సెప్టెంబరు 1న విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంది. అయితే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. దీని వెనుక ఓ ప్రముఖ హీరో టీమ్ వుందని, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కావాలనే తక్కువ రేటింగ్స్ ఇచ్చారని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం మీద తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
‘ఖుషి’ విజయాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తన మీద, తన సినిమా మీద దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొందరు డబ్బులు ఇచ్చి ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ రివ్యూలు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్: ఈసారి ఊచకోత మామూలుగా ఉండదు!
"తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు నా మైండ్ లో రెండు మూడు విషయాలు నడుస్తున్నాయి. అసలు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మీరు చూపిస్తున్న ప్రేమ నా మనసును చాలా గట్టిగా తాకుతోంది. ఇంకో విషయం ఏంటంటే నా మీద, మా సినిమాపైన సోషల్ మీడియాలో అటాక్స్ జరుగుతున్నాయి. ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, ఊరు పేరు లేని వేల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోలు చేయించారు. కొందరు డబ్బులిచ్చి మరీ ఇదంతా చేయిస్తున్నారు. ఇవన్నీ దాటుకొని ఈ సినిమా ఇలాంటి కలెక్షన్స్ రాబడుతోందంటే అదంతా మీ అభిమానుల ప్రేమ వల్లనే. మీ అరుపులు కేకలు వినిపిస్తుంటే దాని గురించి అసలు మాట్లాడాలనిపించడం లేదు. దాని సంగతి తర్వాత చూసుకుందాం" అని విజయ్ దేవరకొండ అన్నారు.
"మీరు ఖుషిగా ఉంటే నేను ఫుల్ ఖుషీ.. మీ ముఖాల మీద నవ్వులు చూడాలనుకున్న కోరిక ఈ సినిమాతో తీరిపోయింది. ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ఖుషి ఒక సింపుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ. మేం క్యూట్ ఎమోషనల్ మూవీ అని తీస్తే, మీరు ఇలాంటి అరుపులు కేకలతో ఇంత పెద్ద విజయాన్ని అందించారు. లైఫ్ లో ఏదోకటి సాధించాలని అనిపించినప్పటి నుంచి డబ్బు సంపాదించాలని, అమ్మానాన్నలను హ్యాపీగా చూసుకోవాలని, సొసైటీలో మనకీ రెస్పెక్ట్ ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నా. ఎప్పుడూ వాటిని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తుంటా. నేను గెలిస్తే ఇంతమంది సంతోష పడుతున్నారు. అందుకే ఇప్పటినుంచి మీకోసం పనిచేయాలనుకుంటున్నా. మీరు ఆనందంగా ఉండటం నాకు ముఖ్యం. ‘ఖుషి’ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. అందుకే రాబోయే పది రోజుల్లో 100 కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున 1 కోటి రూపాయలు అందిస్తా. మనమంతా దేవర ఫ్యామిలీ" అని విజయ్ దేవరకొండ అన్నారు.
విజయ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 'ఖుషి' సినిమాపై కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇలా డబ్బులు ఇచ్చి మరీ ఫేక్ రేటింగ్స్ పెట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే చర్చలు జరుగుతున్నాయి. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చేంత గొప్ప మనసున్న హీరోని టార్గెట్ చేస్తున్నదెవరు? అని అందరూ ఆలోచిస్తున్నారు.
Also Read: 'ఖుషి' విజయాన్ని పురస్కరించుకుని రూ.1 కోటి విరాళం ప్రకటించిన విజయ్ దేవరకొండ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial