సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ సేవాగుణం గుణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడానికి, తోటి వారికి తనవంతు సాయం చేయడానికి యువ హీరో ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తన మంచి మనసు చాటుకొని రియ‌ల్ లైఫ్‌ లోనూ హీరో అనిపించుకున్నారు. ఇప్పుడు 'ఖుషి' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్, తాజాగా మరోసారి తన ఉదారత చూపించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 


'లైగర్' డిజాస్టర్ తో రేసులో కాస్త వెనుకబడిపోయిన విజయ్ దేవరకొండ.. రీసెంట్ గా 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రానికి సానుకూల స్పందన లభిస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చాలా కాలం తర్వాత సరైన హిట్టు కొట్టిన విజయ్.. ఈ విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ సంతోషంలో తన సంపాదనలో నుంచి 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.


'ఖుషి' బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం వైజాగ్ లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖుషి సక్సెస్ లో అభిమానులను భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుండి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు. ''మీతో కలిసి ఖుషీని పంచుకోడానికి నేను ఒక కోటి రూపాయలు నా సంపాదన నుంచి మన ఫ్యామిలీస్ కి ఇస్తున్నాను. 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి రాబోయే పది రోజుల్లో ఒక్కో ఫ్యామిలీకి ఒక లక్ష రూపాయల చెక్ ని నేనే స్వయంగా అందిస్తాను'' అని విజయ్ అన్నారు. 


''నా సక్సెస్ లో నా హ్యాపీనెస్ లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీ లాంటి వారు. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని రేపు సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని హైదరాబాద్ లో చేయబోయే ఖుషి ఈవెంట్ కంటే ముందే ఈ మొత్తాన్ని వారికి అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది'' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. 






Also Read: 'సలార్' డేట్‌పై ఖర్చీప్స్ వేస్తున్న క్రేజీ సినిమాలు!


ఇప్పటివరకు ఏ హీరో చేయని విధంగా తన అభిమానుల ఫ్యామిలీలకు రూ. కోటి గిఫ్ట్ గా ఇవ్వడానికి ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ పెద్ద మనసుని ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే. నిజానికి ఇలా సాయం చేయడం VD కి కొత్తేం కాదు. కోవిడ్ టైములో ఇబ్బందులు ఎదుర్కుంటున్న మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించారు. 'మిడిల్ క్లాస్ ఫండ్', 'ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్' అనే రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి రౌడీ క్లబ్ వాలంటీర్స్‌ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. అలానే క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగల సందర్భంగా తన తరపు నుంచి 100 మంది పేదవారికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున సహాయం చేసాడు. ఇప్పుడు 100 కుటుంబాలకు కోటి రూపాయలు సాయం చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయమని చెప్పాలి. 


ఇక 'ఖుషి' విషయానికొస్తే, విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భార్యాభర్తలు సంతోషంగా కలిసి ఉండాలంటే జాతకాలు కలవడం కాదు, వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయం సాధించడంతో చిత్ర బృందం ఇటీవల యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. 


Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్: ఈసారి ఊచకోత మామూలుగా ఉండదు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial