రెబల్ స్టార్ ప్రభాస్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న 'సలార్' పార్ట్-1 చిత్రాన్ని సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5 రోజుల లాంగ్ వీకెండ్ కావడంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ మారుతోంది. నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ, సినిమా విడుదల వాయిదాపై ఇండస్ట్రీ వర్గాల్లో అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కసారిగా విడుదల తేదీలన్నీ తారుమారు అవుతున్నాయి.
'సలార్' వాయిదా పడుతుందని తెలియగానే, సెప్టెంబర్ 28 డేట్ కోసం టాలీవుడ్ లో తీవ్ర పోటీ నెలకొంది. అంతమంచి తేదీని వదులుకోవడం ఎందుకని ప్రతీ మేకర్ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ కొందరు సలార్ డేట్ పై ఖర్చీప్స్ వేసుకొని కూర్చున్నారు. మరికొందరు అదే వీక్ లో రావడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇంకొందరు దసరా లాంటి టఫ్ కాంపిటీషన్ ను వదిలేసి, అదే తేదీకి ప్రీ పోన్ చేసుకోవాలని చూస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇప్పటికే కొన్ని సినిమాలు 'సెప్టెంబర్ 28 విడుదల' అంటూ హడావుడి మొదలెట్టేసాయి. ‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ ‘రూల్స్ రంజన్’ ని అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఏఎం రత్నం సమర్పణలో రత్నం కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'మ్యాడ్' (MAD) మూవీని సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ తో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక కూడా నిర్మాతగా సినీ రంగంలో ఎంట్రీ ఇస్తోంది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన మిస్టర్ పోలిశెట్టి!
సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న 'పెదకాపు-1' సినిమా కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజులుగా మంచి డేట్ కోసం చూస్తున్న మేకర్స్.. సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పుడు లేటెస్టుగా 'స్కంద' సినిమా కూడా ఈ రిలీజుల జాబితాలో చేరిపోయింది. ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 15న విడుదల చేయాలని భావించారు. దీనికి తగ్గట్టుగానే సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు దూకుడుగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు 'సలార్' డేట్ మారడంతో సెప్టెంబర్ 28వ తేదీకి తమ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వెనుక నిర్మాత దిల్ రాజు హస్తం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
సెప్టెంబర్ 15న ప్లాన్ చేసిన 'స్కంద', 'చంద్రముఖి 2' సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ బ్లాక్ చేసుకున్న డేట్ ఫ్రీ అవ్వడంతో, ఒక సినిమాని సలార్ డేట్ కు పంపాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే రామ్ - బోయపాటిల చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఏదేమైనా ఒక్క 'సలార్' డేట్ మారడంతో చాలా సినిమాల విడుదలలు మారిపోతున్నాయి. ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ నిర్మించిన 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమా బరిలో ఉండనే ఉంది. ఇప్పుడు కొత్తగా అదే వారంలో నాలుగు చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా సెప్టెంబర్ 28న రావాలని చూస్తున్నాయి. మరి ఫైనల్ గా 'సలార్' తేదీకి ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.
Also Read: 'పుష్ప' తరహాలో 2 పార్ట్‌లుగా 'హరి హర వీరమల్లు'? రిలీజ్ డేట్‌పై నిర్మాత క్లారిటీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial