పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే మూడేళ్ళ క్రితమే మొదలైన ఈ సినిమా ఇంకా సెట్స్ మీదనే ఉంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్న తరుణంలో, తాజాగా విడుదలపై నిర్మాత కీలక అప్డేట్ అందించారు. 


కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన 'రూల్స్ రంజాన్' మూవీని ఏఎం రత్నం సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి, సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి హాజరైన నిర్మాత ఏఎం రత్నం.. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. అంతేకాదు ఈ సినిమాని రెండు పార్ట్స్ గా చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 


ఏఎం రత్నం మాట్లాడుతూ.. ''హరి హర వీరమల్లు అనేది చాలా పెద్ద సినిమా. భారీ స్థాయిలో రూపొందే పీరియాడిక్ మూవీ. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఒకేసారి డేట్స్ అన్నీ ఇచ్చినా ఈ సినిమా చేయలేం. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా తీసే సినిమా కాదు. భారీ సెట్స్ వెయ్యాలి. చాలా గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. చాలా పని ఉంటుంది. సినిమాలు చేసిన డబ్బులను పాలిటిక్స్ లో ఖర్చు పెడుతున్నాని పవన్ స్వయంగా చెప్పారు. అందుకే ప్యారలల్ గా తక్కువ రోజుల్లో అయిపోయే కొన్ని రీమేక్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఎడింగ్ లోపు మా సినిమా షూటింగ్‌ ఫినిష్ చేస్తాం. వచ్చే ఏడాది ఎలక్షన్స్ కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. అంతేకాదు ఈ మూవీ 2 పార్ట్స్ గా రావొచ్చని, ఈ సబ్జెక్ట్ మన కంటే నార్త్ వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు.


Also Read: ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన మిస్టర్ పోలిశెట్టి!


మూడేళ్ళుగా నిర్మాణ దశలోనే ఉన్న 'హరి హర వీరమల్లు' సినిమాని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత ప్రకటించడంతో, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే, ఆ తర్వాత రెండో భాగం మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఈసారి తమ అభిమాన హీరో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇటీవల కాలంలో పలు పాన్ ఇండియా చిత్రాలు రెండు భాగాలుగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమా ఈ ట్రెండ్ ని స్టార్ట్ చెయ్యగా.. ఆ తర్వాత KGF, పొన్నియన్ సెల్వన్, పుష్ప చిత్రాలు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'హరి హర వీరమల్లు' మూవీ కూడా 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉందని నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్ ని బట్టి అర్థమవుతోంది. 


కాగా, 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీలకు సంబంధించిన కథాంశంతో 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. నోరా ఫతేహి, విక్రమ్‌ జిత్‌ విర్క్‌, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


Also Read: హరి హరా.. పవన్ సినిమా జీవితకాలం లేటేనా? ఇప్పట్లో మోక్షం కలిగేనా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial