Pregnancy Telugu News | ప్రసవం స్త్రీకి మరోజన్మగా భావిస్తారు. ఎందుకంటే మానసికంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా రకరకాల మార్పులకు సిద్ధపడాలి. కడుపులో పెరుగుతున్న శిశువుకు అనుకూలంగా ఆ సమయంలో స్త్రీల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. కొంత మందిలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపొరోసిస్ అనే ఎముకలకు సంబంధించిన సమస్య రావచ్చు. ఈ పరిస్థితి వల్ల గర్భం సమయంలోనూ ప్రసవం తర్వాత కూడా స్త్రీల ఎముకల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఈ సమస్య రాకూడా నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
అసలు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టయోపోరోసిస్ అంటే..?
గర్భవతుల్లో ఎముకల సాంద్రత తగ్గి గుల్లబారిపోవడాన్నే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇలా జరిగితే చాలా సులభంగా ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎముక సాంద్రత తగ్గినపుడు ఎముకల్లో నొప్పి, పగుళ్లు ఏర్పడడం వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా మహిళల్లో ఈ సమస్య మెనోపాజ్ వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపొరోసిస్ మాత్రం చిన్న వయసులో ఉన్న గర్భవతుల్లోనూ కనిపిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో శరీరంలో కలిగే మార్పులకు సంబంధించినదిగా భావించవచ్చు.
ఎందుకు ఈ సమస్య
ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపొరోసిస్ రకరకాల కారణాలతో రావచ్చు.
పోషకాహార లోపం
ఎముకలు బలంగా ఉండేందుకు విటమిన్ D, క్యాల్షియం తగినంత అవసరమవుతుంది. గర్భవతులు తప్పకుండా ఈ పోషకాలు తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఈ పోషకాల లోపం ఎముకలను బలహీన పరుస్తుంది. ఫలితంగా ప్యాక్చర్ ప్రమాదం పెరుగుతుంది.
జీన్స్
కుటుంబ చరిత్రలో ఇలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపొరోసిస్ ఉండి ఉంటే తర్వాత తరాల్లోనూ ఈ సమస్య కనిపించవచ్చు.
గర్భధారణకు ముందే ఉండే అనారోగ్యాలు
రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఇతర మరేదైనా ఆటోఇమ్యూన్ సమస్యలు ఎముకల ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపవచ్చు. కొన్ని సార్లు వీటి కోసం వాడే మందుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువ సార్లు గర్భం దాల్చడం
చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు గర్భం దాల్చిన వారిలో తరచుగా శరీరం గర్భధారణ కోసం జరిగే మార్పులతో ఒత్తిడికి లోనవుతుంది. ఇలాంటి వారిలో కూడా ప్రమాదం ఎక్కువే.
శారీరక శ్రమ
తగినంత విశ్రాంతి లేకుండా ఎక్కువ మొత్తంలో శారీరక శ్రమ చేసే గర్భవతుల్లో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఎముకల్లో పగుళ్లు ఏర్పడవచ్చు.
లక్షణాలు, నిర్ధారణ
గర్భవతుల్లో అకస్మాత్తుగా తీవ్రమైన ఎముక నొప్పి రావడం, తరచుగా ఎముకల్లో పగుళ్లు ఏర్పడడం, ఎత్తు తగ్గినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వారిలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆస్టియోపోరొసిస్ వ్యాధి ఉందని అనుమానించాలి. దీన్ని నిర్ధారించేందుకు ఇప్పటి వరకు ఉన్న మెడికల్ హిస్టరీ, శారీక, ఎముక బలం తెలియజేసే పరీక్షలు, ఎముక సాంద్రతను తెలిపే స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
నివారించడం మేలు
ఎప్పుడైనా చికిత్స కంటే నివారణ మేలు. గర్భవతుల్లో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు అవసరం.
కాల్షియం, విటమిన్ డి తగ్గకుండా ఉండేందుకు ఇవి ఎక్కువగా కలిగిన పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, గింజలు వంటివి ప్రతి రోజూ తీసుకోవాలి. సప్లిమెంట్లు అవసరమవుతాయా లేదా అనే విషయాన్ని నిపుణులు నిర్ణయిస్తారు. వారి సలహా మేరకు సప్లిమెంట్లు వాడుకోవచ్చు.
ప్రతి రోజు తప్పకుండా తగినంత వ్యాయామం చెయ్యాలి. వాకింగ్, స్విమ్మింగ్ లేదా ప్రీనేటల్ యోగా వంటి వెయిట్ బేరింగ్ వర్కవుట్లు చెయ్యాలి. వర్కవుట్ తో ఎముకలు మాత్రమే కాదు శరీరం మొత్తం బలంగా తయారవుతుంది.
వర్కవుట్ ఎంత ముఖ్యమో విశ్రాంతి అంతే ముఖ్యమని గర్భవతులు మరచిపోవద్దు. తప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సుఖ ప్రదమైన నిద్ర కూడా చాలా అవసరం. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.
క్రమం తప్పని మెడికల్ చెకప్ లు కూడా చాలా అవసరం. శరీరంలో ఏవైనా అవాంఛిత మార్పులు సంభవిస్తే వాటిని ఆదిలోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక క్రమం తప్పకుండా డాక్టర్ ను కలుస్తుండాలి.
Also Read: Childhood Obesity : పిల్లలు లావుగా ఉంటే మధుమేహమొచ్చే అవకాశలెక్కువట.. నిపుణుల సూచనలు ఇవే