వేగంగా కదులుతున్న రైళ్లలాంటివి నేటి జీవితాలు. ఆ జీవితాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల్లో ఒత్తిళ్లు అధికమైపోతున్నాయి. ఒత్తిడి చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ అది శరీరంలో చేసే మార్పులు ఇన్నీ అన్నీ కావు. ముఖ్యంగా చాలా విషయాలలో భయం, మానసిక ఆందోళనలు కలుగుతాయి. వీటి వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల ఏ పనీ చేయాలనిపించదు. అలాగే లైంగిక జీవితంపై కూడా ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
ఎలా ప్రభావితం చేస్తుంది?
మీకు ఒత్తిడి కలిగినప్పుడు శరీరం సర్వైవల్ మోడ్‌లోకి వెళుతుంది. ఆ సమయంలో సంతానోత్పత్తి వంటి పనులపై ఆసక్తి ఉండదు. ఒత్తిడి కారణంగా, మీ శరీరం జీవించడం కోసం రక్త ప్రవాహం, హృదయ స్పందన వంటి అత్యంత ముఖ్యమైన విధులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. సెక్స్ వంటి ఇతర పనులకు ప్రాముఖ్యత ఇవ్వదు. దానివల్ల మీకు ఆ పనిపై ఆసక్తి రాదు. దీర్ఘకాలికంగా ఒత్తిడి కలగడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతంది. ఇది మీ లిబిడోను తగ్గిస్తుంది. ఈ హార్మోన్ వల్ల మహిళల్లో ఋతు చక్రం కూడా క్రమం తప్పుతుంది.
మెదడే ముఖ్యం..
లైంగిక జీవితంలో అతి ముఖ్యమైన సెక్స ఆర్గాన్ ‘మెదడు’. మీ మెదడు సంతోషంగా, విశ్రాంతిగా ఉంటేనే మీకు ఆనందాన్ని అందించే పనుల వైపు మనసు మళ్లుతుంది. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ మెదడు ఆనందం,ఉద్రేకం, ఉద్వేగంపై దృష్టి పెట్టడం చాలా కష్టం. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా నిరాశ, యాంగ్జయిటీ వంటి వాటికి దారితీస్తుంది. ఇది మీ లైంగిక జీవితాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
గుర్తించి...
ఒత్తిడి కారణంగా మీరు లైంగిక జీవితానికి దూరం అయితే ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. మొదటే దానికి చికిత్స తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యాలతో పాటూ, కుటుంబంలో కలహాలు కూడా పెరిగిపోతాయి. ఒత్తిడి శరీరం అంతటా ప్రభావం చూపిస్తుంది. కేవలం లైంగిక జీవితమే కాదు ఇంకా ఎన్నో రకాలుగా బాధిస్తుంది. దీని వల్ల కోపం, బాధ, నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం అంతా గుండెపై పడుతుంది. ఇది గుండెపోటుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి రెండు రకాలు ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. ఇందులో ఎక్యూట్ స్ట్రెస్ స్వల్పకాలం పాటూ వచ్చి పోతుంది. కానీ క్రానిక్ స్ట్రెస్ దీర్ఘకాలికంగా ఉంటుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాలి.
Also read: తరచూ కళ్లు తిరుగుతున్నాయా? అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయేమో?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.