Archean Chemical IPO: ఇవాళ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్ అరంగేట్రం చేశాయి. ఒకటి ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ (Five Star Business Finance), రెండోది ఆర్కియన్ కెమికల్ (Archean Chemical). ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ షేర్లు 5% డిస్కౌంట్‌తో ఇవాళ లిస్ట్‌కాగా, దీనికి విరుద్ధంగా ఆర్కియన్ కెమికల్ షేర్లు 10% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
ఆర్కియన్ కెమికల్ ఒక్కో షేరు ఇష్యూ ప్రైస్ రూ.407 కాగా..., బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE) రూ. 449 వద్ద; నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (NSE) రూ. 450 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇవాళ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైనా, ఈ కంపెనీ షేర్లకు గిరాకీ కనిపించింది. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఇష్యూని సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్లకు ట్రేడింగ్ ఆరంభంలోనే 10% లాభాలు కనిపించాయి.
Archean Chemical IPO వివరాలు
ఆర్కియన్ కెమికల్ IPO నవంబర్ 9న ప్రారంభమై 11న ముగిసింది. IPO ప్రైస్ బ్యాండ్ ను రూ. 386 నుంచి రూ. 407 మధ్య నిర్ణయించారు.
పబ్లిక్ ఇష్యూ కంటే ఒకరోజు ముందు, 1.62 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ. 407 చొప్పున యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ కేటాయించింది. తద్వారా, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లను సేకరించింది. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన యాంకర్ ఇన్వెస్టర్లలో... గోల్డ్‌మన్ సాక్స్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, BNP పారిబాస్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ICICIC ప్రుడెన్షియల్, DSP స్మాల్ క్యాప్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, SBI మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా MF, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి.
ఆర్కియన్ కెమికల్ IPOలో, ఫ్రెష్ షేర్ల ఇష్యూతో పాటు ప్రమోటర్లు కూడా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో కొంత వాటాను ఆఫ్‌లోడ్ చేశారు. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా వచ్చే డబ్బు మాత్రమే కంపెనీ ఖాతాలో చేరుతుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనుంది.
ఆర్కియన్ కెమికల్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 48.91 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం 14.90 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 9.96 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
Archean Chemical వ్యాపారం
బ్రొమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, సల్ఫేట్ వంటి స్పెషలైజ్డ్ మెరైన్ కెమికల్స్ ఎగుమతిలో దేశంలోనే అతి పెద్ద సంస్థ ఆర్కియన్ కెమికల్. గుజరాత్ తీరంలో ఈ కంపెనీ ఉత్పత్తి ఫ్లాంట్లు ఉన్నాయి. ఆర్కియన్ కెమికల్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కస్టమర్లు ఉన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.