Hyderabad Crime News: కుటుంబ సభ్యులంతా ఊరెళ్లారు. ఇదే అదునుగా భావించిన యువకుడు అర్ధరాత్రి ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆమెతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఉదయం లేచి చూసేసరికి ఆమె చనిపోయి ఉండడంతో గజగజా వణికిపోయాడు. ఏం చేయాలో పాలుపోక స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడి సలహా మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన 29 ఏళ్ల యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. తల్లి, సోదరితో కలిసి చింతల్ లోని ఓ కాలనీలో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసేందుకు చింతల్ వెళ్లాడు. అక్కడి కల్లు దుకాణంలో నుంచి ఓ మహిళ రావడం గమనించాడు. ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపాడు. ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఫుల్లుగా తాగి అక్కడే పడుకుండిపోయారు. అయితే శనివారం రోజు ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి మహిళ నోటి వెంట నురగలు రావడం గమనించాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. విషయం గుర్తించిన యువకుడు భయంతో గజగజా వణికిపోయాడు. అసలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి చనిపోయి ఉండడంతో తనకేదైనా సమస్య వస్తుందని భయపడిపోయాడు. 


ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆలోచించాడు. వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడి సూచన మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలిపాడు. ఆదివారం ఉదయం పోలీసులు ఆ యువకుడి గదికి వెళ్లి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మహిళ మరణంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే మృతురాలి శరీరంపై పట్టబొట్లు ఉన్నాయి. ఆమె చేతిపై సంతోష్, సాయిలు, నరేష్ అనే మూడు పేర్లు ఉన్నాయి. ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు సవాల్ గా మారింది. 


సూదిమందు వికటించి విద్యార్థి మృతి..!


హన్మకొండ జిల్లా ఎల్కుతుర్తి మండలం జగన్నాథపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బడి రవీందర్ కు ఇద్దరు కుమారులు. ముల్కనూర్ లోని సహకార సంఘంలో పని చేసే ఆయన కుమారులను ఉన్నత చదువులు చదివించాలని ఆశలు పెట్టుకున్నారు. పెద్ద కుమారుడు విజయ్ కు 22 సంవత్సరాలు. ఈయన ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ చదవడానికి కెనడా వెళ్లాలనుకున్నారు. ఈనెల 22వ తేదీన వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దురదృశ్టవశాత్తు శనివారం రోజు విజయ్ కు జ్వరం వచ్చింది. 


విజయ్‌ తల్లిదండ్రులు జీల్గుల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. వైద్యుడు శ్రీనివాస్ మాత్రలు ఇచ్చి పంపించాడు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మరోసారి వైద్యుడి వద్దకు వెళ్లగా సూది మందు వేశాడు. అయితే సూదిన వేసిన ప్రాంతంలో నొప్పి ఎక్కువ కావడంతో మళ్లీ అదే వైద్యుడి వద్దకు వెళ్లారు. అయితే వెంటనే ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్.. విజయ్ ను హుజూరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడి వైద్యులు పరిశీలించి ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా అప్పటికే విజయ్ మృతి చెందారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా బతకాలనుకున్న తమ కుమారుడు అచేతన స్థితిలో పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.