ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అదే తీవ్రతతో నెమ్మదిగా కదులుతోంది. 24గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు రానుంది. ఇది గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్‌కు తూర్పున 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 


ఇది వచ్చే 6 గంటల్లో ఇప్పుడున్న తీవ్రతతోనే కొనసాగనుంది. తర్వాత వాయువ్య దిశగా నెమ్మదిగా కదులబోతోంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది 24 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతుంది.


తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాలవైపు వచ్చే క్రమంలో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం, బుధవారం దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది 






ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా ఉంటుంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలడిగా ఉంటుంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఈ అల్పపీడం వల్ల కురిసే వర్షాలు, వీచేగాలులు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతుల బాగా పడిపోనున్నాయి. చలి బాగా పెరిగే అవకాశం ఉంది. 






తెలంగాణలో వాతావరణం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం ఉరుములతో కూడిన చిరుజల్లులు పడొచ్చు. బుధవారం, గురువారం మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది. 






హైదరాబాద్‌లో సహా పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 14డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశల నుంచి గాలులు గంటలు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అత్యధిక టెంపరేచర్‌ ఖమ్మంలో 31.6 డిగ్రీలు ఉంటే.. అత్యల్పం ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీలుగా నమోదు అయింది.