Diabetes: డయాబెటిస్ ఒక్కసారి ఒంట్లో చేరిందా, దాన్ని అదుపులో ఉండచమే తప్ప పూర్తిగా లేకుండా చేయడం కుదరదు. అందుకే వచ్చాక బాధపడడం కన్నా, రాకుండా ముందే జాగ్రత్త పడడం ఉత్తమం. అయితే డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గించేలా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఇంతవరకు డయాబెటిస్ రావడానికి కుటుంబ చరిత్ర, చెడు జీవనశైలి, కొన్ని రకాల ఆహారాలు మాత్రమే కారణం అనుకున్నారు. కానీ ఇప్పుడు వీటికి జతగా మరొకటి కలిసింది. అదే ‘ఒంటరితనం’. ఎవరైతే తమ జీవితాన్ని ఒంటరిగా గడుపుతారో వారు త్వరగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని కొత్త అధ్యయనం చెబుతోంది. 


డయాబెటోలోజియా అనే జర్నల్లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని వెస్ట్రన్ నార్వే యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ రోజర్ హెన్రిక్సెన్, అతని సహచరులు కలిసి నిర్వహించారు. ఒంటరితనం , డయాబెటిస్ అభివృద్ధి చెందే ప్రమాదం మధ్య అనుబంధాన్ని పరిశీలించడంతోపాటు, డిప్రెషన్, నిద్రలేమి వంటివి కూడా పాత్ర పోషిస్తాయా లేదా అని పరిశీలించారు. 


ఒంటరితనంతో నష్టమే..
ఎవరైతే తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తారో వారు ఒత్తిడికి గురవుతారని, ఆ ఒత్తిడి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒంటరితనం శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని కలిగిస్తాయని, ఇది దీర్ఘకాలంగా ఉంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వివరించారు. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్  అధికంగా విడుదలైతే ఇన్సులిన్ నిరోధకత వంటివి పెరిగిపోతాయి. అలాగే మెదడులో తినే ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దీని వలన ఆకలి పెరుగుతుంది. అది కూడా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినాలన్న కోరిక పెరిగిపోతుంది. అలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఇలా పెరగడం వల్ల డయాబెటిస్ కలుగుతుంది. 


ఇంకా ఇతర సమస్యలు...
ఒంటరితనం ఇంకా ఎన్నో సమస్యలను పెంచుతుంది.డయాబెటిస్,డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి ఎన్నో ఇతర సమస్యలు రావచ్చు. ఇవి దీర్ఘకాల వ్యాధులకు కారణం అవుతుంది. మనసులోని భావాలు పంచుకోవడానికి మనిషి లేక మానసికంగా చాలా కుంగిపోయే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారు త్వరగా జంటైపోతే ఆరోగ్యం కూడా బావుంటుంది. 


Also read: వెన్నునొప్పి వస్తే తేలికగా తీసుకోవద్దు, అది ఈ మూడు క్యాన్సర్ల లక్షణం కావచ్చు


Also read: పెళ్లయిన తొలిరాత్రి భార్యాభర్తలు పాలు తాగడం వెనుక అసలు లాజిక్ ఇదే












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.