Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్‌తో పోటీపై మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవ అభ్యర్థి అయితే బాగుంటుందని శశి థరూర్‌కు తాను చెప్పానని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
నేను దళిత నేతగానే కాదు.. 55 ఏళ్లు పనిచేసిన నాయకుడిగా పోటీ చేస్తున్నాను. సీనియర్ నేతలంతా ఒత్తిడి చేయడంతో అధ్యక్ష బరిలోకి దిగాను. నేను ఎవరిపైనా వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదు. పార్టీ సిద్ధాంతాల కోసమే పోరాడుతున్నాను. థరూర్ చెబుతున్న యథాతథ స్థితి, మార్పు అనేవాటిని నిర్ణయించేది పీసీసీ ప్రతినిధులు, ఏఐసీసీ. అందరి ఆమోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశి థరూర్‌కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు. - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి
భాజపాపై
కాంగ్రెస్‌ను భాజపా ఎప్పుడూ తక్కువగా చూస్తుందని ఖర్గే ఆరోపించారు. అసలు భాజపాలో ఎన్నికలు ఉంటాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్.. ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుందని, భాజపాలో నియంతృత్వ పార్టీ కాదని ఖర్గే అన్నారు.
భాజపా ఎప్పుడూ కాంగ్రెస్‌ను తక్కువ చేసి చూస్తుంది. అసలా పార్టీలో ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? దానికి ఎన్నికల అథారిటీ అంటూ ఉందా? జేపీ నడ్డాను ఎవరు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి
చర్చకు
మరోవైపు శశి థరూర్.. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే గెలిస్తే కాంగ్రెస్‌లో కార్యకర్తలు కోరుకుంటున్న మార్పు రాదన్నారు. తాను మాత్రమే మార్పు తేగలనని శశి థరూర్ చెప్పారు.
ఖర్గేతో నాకెలాంటి సైద్ధాంతిక విభేదాలూ లేవు. ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. సంస్కరణలకు సంబంధించి మా దృక్పథాలు, ప్రణాళికలను 9 వేల మందికి పైగా ఓటర్లు (పీసీసీ ప్రతినిధులు) తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరిని ఎన్నుకోవాలనేది కార్యకర్తలకే వదిలేయాలి. - శశి థరూర్, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి
అయితే శశి థరూర్‌తో బహిరంగ చర్చ ప్రతిపాదనను మల్లికార్జున్ ఖర్గే తిరస్కరించారు. చర్చకు తాను ఒప్పుకోనన్నారు.
Also Read: Bharat Jodo Yatra: మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు, ప్రజల గొంతుక వినిపించి తీరదాం - కర్ణాటకలో రాహుల్ గాంధీ
Also Read: Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు