టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో రూపాంతరం చెందనున్నట్లుగా స్పష్టమైన సంకేతాల నడుమ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నట్లుగానే ఒక తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు అతి దగ్గర్లోనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి (అక్టోబరు 2) కరీంనగర్‌లో జరిగిన కళోత్సవాల ముగింపు సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్‌ స్థాపించబోయే జాతీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.


ఒకప్పుడు సినిమాల్లో ఎందరో అజ్ఞాత సూర్యులు ఉండేవారని, తమది తెలంగాణ అని ఎవరూ గుర్తించలేకపోయేవారని అన్నారు. ఇప్పుడు సినిమా కథలో తెలంగాణ నేపథ్యం ఉంటేనే హిట్టవుతుందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ గురించి తెలుగు సినిమాల్లో చెప్పుకోలేకపోయేవారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందని, ఎమ్మెల్యే రసమయి నేతృత్వంలో రాష్ట్రంలో 574 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇంకా అనేకమంది కళాకారులు ఉన్నారని, వారికీ అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ వైభవాన్ని చాటేలా హైదరాబాద్‌లో కళోత్సవాలు నిర్వహించుకుందామని చెప్పారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న తరహాలోనే ఒక తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.






ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్‌, శివారెడ్డి, రోజారమణి తదితర కళాకారులను కేటీఆర్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, కోడూరి సత్యనారాయణ పాల్గొన్నారు.



తెలుగు, ఎరుపు కలిస్తేనే గులాబీ
2001 ఏప్రిల్‌ 27న పుట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ అదే ఏడాది మే 17న కరీంనగర్‌ గడ్డపై సింహ గర్జన నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ కరీంనగర్‌లోనే సీఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయం రేపు సంచలనం కాబోతుందని చెప్పారు. కేసీఆర్‌ నిర్ణయానికి ప్రజలందరి మద్దతు, ఆశీర్వాదం కావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ మాట ఎంత పవర్‌ఫుల్‌గా పేలిందో కళాకారుల ఆటా, పాట కూడా అంతే పవర్‌ఫుల్‌గా పేలాయని అన్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన ఎర్రజెండా పాటను ప్రస్తావించారు. ఎరుపు, తెలుపు కలిస్తేనే గులాబీ జెండా అవుతుందని అన్నారు. నాడు ఎరుపు రంగు కోరుకున్న పనులన్నీ ఇపుడు కేసీఆర్‌ చేస్తున్నారని చెప్పారు.


కరీంనగర్ లోనే జాతీయ పార్టీ ఆవిర్భావ సభ - గంగుల
జాతీయపార్టీ ఆవిర్భావ సభను కరీంనగర్‌లోనే నిర్వహించాలని ఈ సభకు హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఇప్పటికే ఐటీ రంగం కూడా కరీంనగర్ లో ఉందని, మెడికల్‌ కాలేజీ కూడా ఉందని అన్నారు. వీటన్నింటికీ కారణం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రోత్సాహమేనని అన్నారు.